వాలంటైన్స్ డే.. అదేనండి ప్రేమికుల రోజు రావడానికి సరిగ్గా నెల రోజులు ఉంది. ఆ రోజు ప్రేమికులకు చాలా ప్రత్యేకం. కొందరు.. ఆ రోజునే తమ మనసుకు నచ్చిన వారికి ప్రేమను తెలియజేస్తారు. ఆల్రడీ ప్రేమలో ఉన్నవాళ్లు.. ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేస్తారు. ఈ ప్రేమికుల రోజున ఎక్కువ ప్రాత పోషించేది గులాబీ పూలు, గిఫ్ట్ లే. ఏ రోజూ లేనంత డిమాండ్ వాటికి అప్పుడు ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ ఏడాది ప్రేమికుల రోజున మీ లవర్ కి ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు. ఇంకా నెల రోజుల సమయం ఉంది కదా.. ఇప్పుడే ఎందుకా తొందర అనుకుంటున్నారా..? తొందరపడాలి.  మీ వాలంటైన్స్ డే ని ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా జరుపుకోవాలనుకంటే.. ఈ కింది వాటిని ఇప్పుడే ఆచరణలో పెట్టేయండి.

1. డిన్నర్ స్పాట్..

చాలా మంది ప్రేమికులు.. ప్రేమికుల రోజు.. ఏదైనా మంచి రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేయాలని భావిస్తారు. అయితే.. చివరి క్షణంలో ఏ రెస్టారెంట్ కి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒక వేళ మీరు అనుకున్న రెస్టారెంట్ కి వెళితే.. అది ఫుల్ అయ్యి ఉండొచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మీకు నచ్చిన రెస్టారెంట్ ని సరిగ్గా ఆరోజుకు ముందే బుక్ చేసుకోండి. ఒకవేళ ఆ సమయంలో వెళ్లడం కుదరకపోతే.. చివరి క్షణంలో అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు.

2. డ్రస్..

ప్రేమికుల రోజు ఎలాగూ ప్రేమికులకు ప్రత్యేకమే. అయితే.. ఆ రోజు మీరు మీ లవర్ కి ప్రత్యేకంగా కనిపించాలే తయారవ్వాలి. అలా అవ్వాలంటే.. అందుకు తగిన డ్రస్ ని ఎంచుకోవాలి. కాబట్టి.. ముందుగానే మీకు నప్పే డ్రస్ ని షాపింగ్ చేయండి. తీరా సమయం దగ్గరపడ్డాక.. ప్రశాంతంగా షాపింగ్ చేయలేరు. లేదా వేరే ఏదైనా పని పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం.

3.గిఫ్ట్స్..

ప్రేమికుల రోజున గిఫ్ట్స్ స్పెషల్ రోల్ ప్లే చేస్తాయి. కచ్చితంగా ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు. కాబట్టి మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఇప్పుడే  సిద్ధం కండి. చాలా చూస్తే తప్ప.. అందులో మనకు నచ్చింది దొరకదు. కాబట్టి ఇప్పటి నుంచే గిఫ్ట్స్ వెతుకులాట మొదలుపెట్టండి.

4. సెలవు..

ఈ ఏడాది వాలంటైన్స్ డే బుధవారం వచ్చింది. కాబట్టి ముందే సెలవు అడిగి తీసుకోండి. లేకపోతే.. మీ లవర్ తో గడపాల్సిన సమయం కాస్త ఆఫీసులోనే గడపాల్సి వస్తుంది.