జానా, జైపాల్ రెడ్డికి గద్వాల జేజమ్మ ఝలక్

dk aruna shocking comments on jana reddy and jaipalreddy
Highlights

తెలంగాణ హాట్ న్యూస్

 అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఇప్పటికీ బతికి బట్ట కట్టిందంటే బలమైన కారణాల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా అందులో ఒకటి అని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం దేశంలోని ఇతర ఏ పార్టీల్లోనూ లేదని చెప్పవచ్చు. పార్టీలో ఎంత పెద్ద లీడరు మీద అయినా సరే ఒక సాధారణ గల్లీ లీడర్ తిరుగుబాటు చేసే స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఎంత కొట్లాడినా.. ఏం చేసినా లాస్టుకు అధిష్టానం చెప్పిందే ఆ పార్టీలో ఫైనల్ అవుతుంది. తాజాగా తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేశారు మాజీ మంత్రి, ప్రస్తుత గద్వాల ఎమ్మెల్యే డి.కె అరుణ. ఆమె చేసిన ఒక ప్రకటనతో తలపండిన రాజకీయ నేతలు కలవరపాటుకు గురయ్యారు. ఇంతకూ గద్వాల జేజమ్మ అంత ఝలక్ ఎందుకిచ్చారు? ఎవరికి ఇచ్చారబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి స్టోరీ.


70 ఏళ్లు దాటిన కాంగ్రెస్ లీడర్లకు ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లేదని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అన్నట్లు ఇటీవల కాలంలో డికె అరుణ ఒక లీక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ మాటలను బట్టి తెలంగాణలో 70 ఏళ్లు దాటిన సీనియర్లకు టికెట్లు రావన్నది డికె అరుణ మాటల సారాంశం. ఆమె మాటలు సీనియర్లను కలవరపాటుకు గురిచేశాయి. ఆమె ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మాటలు మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డిని ఉద్దేశించి అన్నారని పార్టీలో జోరుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం జైపాల్ రెడ్డి వయసు 76 ఏండ్లు అయితే ఆమె జైపాల్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడితే ఆయతోపాటు జానారెడ్డి (71)కి, పొన్నాల లక్ష్మయ్య(74)కు, మర్రి శశిధర్ రెడ్డి (72) కి, గీతారెడ్డి (70) లాంటి వాళ్లకు కూడా తగిలాయి. దీంతో వాళ్లంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అసలు రాహుల్ గాంధీ అన్నారా లేదా అన్నది పక్కన పెడితే డికె అరుణ మాత్రం కాంగ్రెస్ పార్టీలో తలపండిన సీనియర్లకు గట్టి ఝలక్ ఇచ్చారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. 


వాస్తవానికి పాలమూరు పాలిటిక్స్ లో జైపాల్ రెడ్డికి, డికె అరుణకు ఏమాత్రం పొసగదు. ఇద్దరి మధ్య తీవ్రమైన రాజకీయ వైరం ఉంది. అందుకే పాలమూరు కాంగ్రెస్ రాజకీయాలు ఇటు జైపాల్ శిబిరం గాను, అటు డికె అరుణ శిబిరం గాను విభజించి చూడాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెప్పుకుంటారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి లాంటి వాళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్లను తీసుకురావడంలో తెర వెనుక మంత్రాంగం అంతా జైపాల్ రెడ్డిదే. అయితే నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్లతో దశాబ్దాల కాలంగా డికె అరుణకు రాజకీయ వైరం ఉంది. ఈ పరిస్థితుల్లో జైపాల్ రెడ్డి వర్గం నాగం వస్తే బలోపేతం అవుతుందన్న ఆందోళన డికె అరుణ వర్గంలో నెలకొంది. అందుకే నాగం లాంటి వాళ్లను పార్టీలోకి రాకుండా డికె అరుణ వర్గం అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ అధిష్టానం మాత్రం వచ్చేవాళ్లను తీసుకుంటాం... అందరూ కలిసి పనిచేయండి... అని సంకేతాలిచ్చింది. దీంతో డికె శిబిరం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టబడింది.


దీనికితోడు గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు సీటుకు జైపాల్ రెడ్డి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు డికె అరుణ సపోర్టు చేయకుండా ఓడించేందుకు ప్రయత్నించారన్న ఉద్దేశంతో జైపాల్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వలసల ద్వారా జైపాల్ వర్గం బలోపేతం అవుతుందన్న ఆందోళనతో ఉన్న డికె వర్గం తాజాగా జైపాల్ ను ఉద్దేశించి ఒక బాంబు పేల్చారు. 70 ఏళ్లు దాటిన సీనియర్లకు టికెట్లు తూచ్ అని రాహుల్ చెప్పినట్లు ఆమె వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా జైపాల్ తోపాటు 70 దాటిన సీనియర్లందరికీ గుబులు మొదలైంది. ఆ మాటలు నిజమేనా అన్నది కూడా ఆరా తీస్తున్నారట. 


మొత్తానికి జేజమ్మ కూడా సొంత పార్టీలో ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసురుతున్నారని పాలమూరు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరి ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయన్నది చూడాల్సిన ముచ్చట.

loader