పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ డీజిల్ ధర రూ.61.74 కు చేరుకోగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.71కు చేరుకుంది. మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా 2014వ సంవత్సరం ఆగస్టు నెలలో ఈ స్థాయిలో ధరలు పెరగగా.. మళ్లీ ఇప్పుడు రికార్డు స్థాయిలో పెరిగాయి.డిసెంబరు 12, 2017న  దేశరాజధాని ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.58.34 ఉండగా, ఒక్క నెలలోనే రూ.3.4పెరిగింది. ఇక పెట్రోలు రూ.2.09 పెరగడం గమనార్హం. 

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే పెట్రోలు ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం ద్వారా సామాన్యుడికి కొంత ఊరట కలిగించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్టోబరు 2017లో ఒకే ఒకసారి ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.2 తగ్గించింది. దీంతో రూ.70.88గా పెట్రోలు ధర రూ.68.33కు రూ.59.14గా ఉన్న డీజిల్‌ ధర రూ.56.89కి చేరింది. కాగా.. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది.