కూరగాయలన్నీ మేలు చేసేవేఅయినా, కొన్ని కూరగాయలంటేకొందరికి గిట్టవు. చాలా మంది కాకర కాయలు ముట్టరు. ఇంకొందరు బెండకాయలు... జిగట అంటారు. మరికొందరు, వంకాయ అలర్జీ అంటారు. అయితే, బీర కాయనచ్చని వాళ్లు మాత్రం చాలా అరుదు. కూరయినా,పప్పయినా,వేపుడయినా, పచ్చడయినా,  చివరకు ఇలా బజ్జీలయినా... బీరకాయ కథే వేరు.

ఎలా చేసినా రుచిగానే ఉంటుంది. నోరూరిస్తూనే ఉంటుంది. బీరకాయ బజ్జీ ప్రసిద్ధ దక్షిణాది వంటకం. దీన్ని సాయంకాలం చిరుతిండిగా తింటారు. చిరుజల్లు కురుస్తూ,కొద్దిగా చలి, చిత్తడి వాతావరణం ఉన్నపుడు టీ  తాగుతూ...ఈ బజ్జీ తింటూంటే ‘అదుర్స్’ అని అరవాల్సిందే ఎవరయినా.పైన కరకరలాడుతూ, లోపల మెత్తని బీరకాయతో ఈ బజ్జీలు చాలా నోరూరిస్తాయి. దక్షిణాదిలో ప్రసిద్ధమైన ఈ వంటకం అన్ని పండగలకి, పార్టీలకు వండతారు. అతిథులు అనూహ్యంగా వస్తే అప్పటికప్పుడు చేసుకోడానికి బీరకాయ బజ్జీ త్వరగా అవుతుంది. రుచికరమైన బీరకాయ బజ్జీ తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం..

కావాలసిన పదార్థాలు..

బీరకాయ -1 చిన్నది. సెనగపిండి -1/2 గిన్నె పసుపు -అర చెంచా ఇంగువ -పావు చెంచా ఎర్రకారం -1 చెంచా జీలకర్ర - అరచెంచా ఉప్పు రుచికి తగినంత నూనె- 2చెంచాలు + వేయించడానికి నీరు -1 కప్పు

తయారుచేసే విధానం..

1.బీరకాయను సగానికి కోసి,ఒకవైపున పైన చెక్కుతీయండి.

 2. చిన్నముక్కలు గుండ్రంగా కోసి పక్కనపెట్టుకోండి.

 3. సెనగపిండిని గిన్నెలో వేయండి.

4. పసుపు, ఇంగువను వేయండి.

5. ఎర్రకారం, జీలకర్రను కూడా వేయండి.

6. ఉప్పును కూడా వేసి బాగా కలపండి.

7.వేడిచేసిన పెనంలో 2 చెంచాల నూనెను వేయండి.

8. నూనెను రెండునిమిషాలు కాగనివ్వండి.

9. దాన్ని మిశ్రమానికి కలపండి.

10. కొంచెం కొంచెం నీరు పోస్తూ పిండిని జారుడుగా కలపండి. 11. వేయించడానికి బాండీలో నూనెను మరగనివ్వండి.

12. బీరకాయ ముక్కలను పిండిలో వేసి బాగా పిండి పట్టేట్లా చూడండి.

13. ఒక్కొక్క పిండిలో ముంచిన ముక్కను నూనెలో వేసి మధ్యమంగా మంటపై వేయించండి.

14.ఒకవైపు వేగాక, తిప్పి మరోవైపు వేయించండి.

15. గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించండి.

16. నూనె నుంచి తీసి , వేడివేడిగా వడ్డించండి.

శెనగపిండిలో ఒక స్పూన్ బియ్యం పిండి కూడా కలిపితే.. బజ్జీలు కరకరలాడుతాయి.