పాతకాలంలో వేసవి వచ్చిందంటే చాలు ఉలవ గుగ్గిళ్లు పొయ్యిల మీద సలసల ఉడికేవి. రెండు దోసిళ్ల గుగ్గిళ్లు తిని, గ్లాసుడు నీళ్లు తాగితే.. ఆ రోజుకు అదే మంచి పౌష్టికాహారం. ఇక, మరుసటిరోజు ఉలవచారు తాగితే.. ఆహా.. ఆ సంతృప్తే వేరు. ఉలవలు ఎక్కువగా తిన్నవాళ్ల ఆరోగ్యం గుర్రంలా దౌడు తీసేది అందుకే! వాటి బలం మరే గింజలకు రాదు. ప్రస్తుతం ఉడికించిన గింజలను తినే అలవాటున్న వాళ్లు.. ఏ శనగలనో, పెసరగింజలనో తినడానికి ఇష్టపడుతున్నారు కాని.. ఉలవల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే వాటిని ఉడికించడం అంత సులభం కాదు.  అయితే.. కేవలం ఉడకపెట్టుకుని మాత్రమే కాదు.. చాలా రకాలుగా ఉలవలు తీసుకోవచ్చు. అందులో ఒకటి ఉలవల పొంగనాలు.. వాటి తయారీ ఇప్పుడు చూద్దాం..

కావాలసిన పదార్థాలు..

ఉలవలు - ముప్పావు కప్పు, ఇడ్లీ పిండి - 2 కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు. నూనె - వేగించడానికి సరిపడా.

తయారుచేసే విధానం..

ఉలవల్ని ఒక రాత్రంతా నానబెట్టి ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. పాన్‌లో ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేగించాలి. ఇప్పుడు ఇడ్లీ పిండిలో రుబ్బిన ఉలవల మిశ్రమంతో పాటు తాలింపు మిశ్రమం వేసి బాగా కలపి గుంతపొంగనాలు చేసుకోవాలి. ఏదైనా రోటీ పచ్చడితో పొంగనాలు వేడివేడిగా తింటే బాగుంటాయి.