సాధారణం బ్రేక్ ఫాస్ట్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఇడ్లీ, దోశ. సౌత్ ఇండియా వంటకమైన ఈ ఇడ్లీ ఇప్పుడు దేశవ్యాప్తంగా లభిస్తోంది. సాధారణంగా ఇడ్లీ అంటే.. మినపప్పు, రవ్వతో కలిపి చేస్తారు. కానీ.. ప్రస్తుతం ప్రజల్లో హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది. దీంతో రకరకాల రూపంలోకి మారిపోయింది.

కొందరు రాగి పిండితో ఇడ్లీ చేస్తుంటే మరికొందరు గోధమలు, కూరగాయలతో కూడా చేస్తున్నారు. తాజాగా మరో ఇడ్లీ అందుబాటులోకి వచ్చింది. అదే స్టఫ్డ్ ఇడ్లీ.  ఇడ్లీ అంటే ఇష్టపడని వాళ్లని కూడా ఆకర్షించేస్తుంది ఈ స్టఫ్డ్ ఇడ్లీ. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే స్టఫ్డ్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావాలసిన పదార్థాలు:

ఇడ్లీ రవ్వ: 2cups

పెరుగు: 1cup

ఆవాలు: 1tsp

కరివేపాకు: రెండు రెమ్మలు

బేకింగ్ పౌడర్(వంట సోడ): 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె : 1tsp

ఇడ్లీ స్టఫింగ్ కోసం:

బంగాళాదుంప: 1cup(2 ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)

పచ్చిబఠాణీ: 1cup(ఉడికించి మెత్తగా చిదిమి పెట్టుకోవాలి)

కారం: 1tsp

పసుపు: 1tsp

ధనియా పౌడర్: 1tsp

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: 1tsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ రవ్వ మరియు ఉప్పు, పెరుగు వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి బాగా కలిపి రెండు మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసి అందులో ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప, పచ్చిబఠాణి, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం, అన్ని వేసి బాగా మిక్స్ చేసి రెండు నిముషాలు వేయించాలి.

3. ఇప్పుడు మరో ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడాక ఇడ్లీ పిండిలో వేయాలి. అలాగే బేకింగ్ పౌడర్ కూడా చిలకరించి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

4. తర్వాత ఇడ్లీ పాత్రను స్టౌ మీద పెట్టి అందులో కొన్ని నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. అంతలోపు ఇడ్లీ ప్లేట్స్ కు కొద్దిగా నూనె రాసి(అవసరమైతేనే)ఇడ్లీ పిండి సగ భాగం మాత్రం పోసి నింపి పెట్టుకోవాలి.

5. తర్వాత స్టఫింగ్ కోసం తయారు చేసి పెట్టకొన్న బంగాళాదుంప మిశ్రమాన్ని స్పూన్ తో ఇడ్లీ పిండి మధ్యలో పెట్టి మళ్ళీ పైన ఇడ్లీ పిండిని పోయాలి. ఇలా అన్ని ప్లేట్స్ నింపుకొన్న తర్వాత ఇడ్లీ స్టాండ్ ను ఇడ్లీ కుక్కర్ లో పెట్టి మూత పెట్టి పది నిముసాలు ఉడికించుకోవాలి.

6. పది నిముషాల తర్వాత ఇడ్లీ స్టాండును బయటకు తీసి ఐదు నిముషాలు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇడ్లీలను సపరేట్ చేసి వేడి వేడి సాంబార్, కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి. అంతే స్టఫింగ్ ఇడ్లీ రెడీ.(స్టఫింగ్ కోసం మీరు క్యారెట్, బీన్స్, ఆకుకూరలు, పన్నీర్ వంటివి కూడా వినియోగించవచ్చు.)