గందరగోళంలో ఫాతిమా కళాశాల విద్యార్థులు న్యాయం చేయాలంటూ ఆందోళన తప్పకుండా న్యాయం చేస్తానని చంద్రబాబు హాామీ

చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలైంది. ఈ మూడున్నరేళ్లలో ఆయన ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. వాటిల్లో చాలా హామీలు ఆచరణకు నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. కాగా.. తాజాగా ఆయన మరో హామీ ఇచ్చారు. ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడిన ఈ హామీనైనా చంద్రబాబు నెరవేరుస్తారా..? అనే అనుమానం మొదలైంది.

అసలేం జరిగిందంటే.. ఫాతీమా కళాశాలలో 2015-16లో జరిగిన అడ్మిషన్లు చెల్లవని భారత వైద్య మండలి(ఎంసీఐ) ప్రకటించింది. దీంతో కళాశాలలోని విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మొత్తం 99మంది విద్యార్థులను ఒక్కో కాలేజీకి 9 మంది చొప్పున 11 ఇతర వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసేందుకు అనుమతించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా.. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో వారి ఆశలు నిరాశలు గా మారాయి. కోర్టులో వేసిన కేసు బలంగా లేకోపోవడంతో విద్యార్థులు ఓడిపోయారు. దీనంతటికీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కారణమని , ఆయన కళాశాల యాజమాన్యంతో కుమ్మక్కై తమకు అన్యాయం చేశారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దీక్ష చేస్తున్న విద్యార్థులకు అన్ని రాజకీయ పార్టీ నేతలు మద్దతు పలుకుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఆ కళాశాల విద్యార్థులను మంత్రి కామినేని.. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి బుధవారం తీసుకొని వెళ్లారు. విద్యార్థుల అనుమానాలను చంద్రబాబు నివృత్తి చేశారు. తన సొంత పిల్లలకైతే ఏవిధంగా న్యాయం చేస్తారో.. అదే విధంగా ఫాతిమా కళాశాల విద్యార్థులకు కూడా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఒక్క శాతం అవకాశం ఉన్నా.. న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.9మంది సభ్యులతో కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి.. కేంద్రంతో మరోసారి చర్చలు జరుపుతామని చెప్పారు. మరోసారి సుప్రీం కోర్టులో కేసు వేద్దామని విద్యార్థులకు తెలిపారు. ఇదే విషయంపై వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్యను ఢిల్లీకి పంపనున్నట్లు సీఎం వివరించారు. కనీసం ఈ హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోకపోతే.. ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా కోల్పోయే అవకాశం ఉందనే వాదనలు వినపడుతున్నాయి.