కెప్టెన్ కూల్ పై హాట్ కామెంట్

టీం ఇండియా దిగ్గజ కెప్టెన్ గా ప్రపంచమంతటా ప్రశంసలందుకున్న ధోనికి ఇంటికష్టాలు మొదలయ్యాయి. బీసీసీఐ కూడా చేయని సహసం ఐపీఎల్ లో ఆయన జట్టు యాజమాన్యం చేస్తోంది.

కెప్టెన్ గా, ఆటగాడిగా మంచి రికార్డు ఉన్న ధోనీని అవమానించే రీతిలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు యాజమాన్యం ప్రవర్తిస్తోంది. ఈ ఐపీఎల్ ప్రారంభానికంటే ముందే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తొలగించిన మేనేజ్ మెంట్ ఇప్పుడు ధోని టార్గెట్ గా మాటలయుద్దం చేస్తోంది.

ముంబై ఇండియన్స్‌పై పుణె విజయం తర్వాత తన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై ప్రశంసలు కురిపించిన టీమ్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా సోదరుడు హర్ష్ గోయెంకా ధోనీని మాత్రం అవమానించాడు. ‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్‌ చూపించాడు. ధోనిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. అతడిది కెప్టెన్‌ ఇన్నింగ్స్‌. కెప్టెన్‌గా స్మిత్ ను నియమించడం సరైన నిర్ణయం’ అని ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్ పై ధోనీ అభిమానులే కాదు క్రికెట్ ప్రేమికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గోయెంకా కాస్త దిగివచ్చాడు. ధోని స్టార్‌ అనే విషయాన్ని అంగీకరిస్తున్నానని, అందరికీ అతను హీరో అంటూ మరో ట్వీట్ పెట్టాడు కానీ, తన వ్యాఖ్యలకు మాత్రం క్షమాపణలు చెప్పలేదు.

ఇదంతా గమనిస్తుంటే బాగా డబ్బు పెట్టి కొన్న ధోనిని వదిలించుకునేందుకే యాజమాన్యం ఇలా ఆయనను అవమానిస్తుందా అనే అనుమానం రాకతప్పదు. కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఇప్పుడు ధోనినే అవమానించడం చూస్తే ఇది నిజమనిపించకమానదు. క్రికెట్ కూడా వ్యాపారం అయిన ఐపీఎల్ లో ఇలాంటి ఘటనలు సహజమే అని సరిపెట్టుకోవాలేమో..