ఈ దేశంలో 30 శాతం మందికి  అక్షరం ముక్కరాదు.. అయినా ఇకపై అంతా ఆన్ లైన్ లోనే లావాదేవీలు జరగాలంటుంది ప్రభుత్వం. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటిఎంల కార్డులను స్వైప్ మిషన్ల లలో గీకేసి ఆన్ లైన్ లోనే అన్ని చెల్లించేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చేస్తుంది.

 

ఆడి కారు నడుస్తున్న రోడ్డుపైనే ఇంకా ఏడ్ల బండిపైనా వెళ్లేవారు ఉన్న దేశం మనది.. అలాంటిది ఒక్కసారిగా అంతా ఆన్ లైన్ లోనే లావాదేవీలు కొనసాగించాలని నేతలందరూ ముక్త కంఠంతో ఆదేశించడం సామాన్యుడికి మింగుడు పడడం లేదు.

 

నోట్ల రద్దు తర్వాత లావాదేవీలు పక్కన పెడితే కనీసం కడుపు నింపుకోవడమే జనాలకు కష్టంగా మారింది. బ్యాంకుల ముందు బార్లా తీరి.. ఏటిఎంల ముందు పడిగాపులు పడి నానా కష్టాలు పడుతున్న కామన్ మెన్ కు కనీసం ఓదార్పు మాటలు కూడా ప్రభుత్వం నుంచి కరువయ్యాయి.

 

నల్ల ధనంపై పోరాటం కోసం ఈ బాధలు పడాల్సిందే అంటూ ప్రభుత్వమే ఓ ఉచిత సలహా ఇచ్చేస్తుంది. అంతేనా ఇక దేశమంతా క్యాష్ లెస్ గా మారాలంటూ ఊదరగొడుతోంది.

 

ఆకలితో దేశమంతా అలమటిస్తుంటే ఆన్ లైన్ కి రండి అంటూ పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం అనేది సామాన్యుడి ప్రశ్న.

 

నోట్ల రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది ఎవరూ కాదనలేదన్న నిజం. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రజలను  క్యాష్ లెస్ కు మారాలంటోంది.

క్యాష్ లెస్ కు మారడం సరే.. ఇంతకీ అలా మారడానికి జనాలు సిద్ధంగా ఉన్న ఇప్పుడు ప్రభుత్వమే సిద్దంగా లేదు.

 

దేశంలో ఆన్ లైన్ లో చెల్లింపు జరిపేందుకు వీలుగా ఉండే స్వైప్ మిషన్లు కొరత ఇప్పుడు తీవ్రంగా ఉంది.

 

అవి దేశంలోని 120 కోట్ల మంది ప్రజలకు ఏ మూలకు సరిపోవు. వాటిపై దేశంలో 90 శాతం మందికి అవగాహనే లేదు. ఇప్పటి వరకు ఆన్ లైన్ లావా దేవీలు జరుగుతోంది దేశంలో 10 శాతం లోపే.

 

స్వైప్ మిషన్లను దేశంలో అత్యధికంగా సరఫరా చేస్తున్న పైన్ ల్యాబ్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఇప్పడు నోట్ల రద్దు నేపథ్యంలో స్వైప్ మిషన్లకు డిమాండ్ పెరిగిందని, గతంలో ఈ స్థాయి డిమాండ్ ఎప్పడూ లేదని పేర్కొంది. నవంబర్ 8 నుంచి తమ స్వైప్ మిషన్లకు డిమాండ్ 60 శాతం పెరిగిందని తెలియజేసింది. అయితే ఇప్పడు ఉన్న డిమాండ్ కు తగ్గట్లుగా స్వైప్ మిషన్లు సరఫరా చేయాలంటే మరో ఏడాది సమయం పడుతుందని తెలిపింది.

 

ఇదండీ సంగతి.. జనాల దగ్గర ఇప్పుడు కార్డులున్నా... గీకడానికి మాత్రం స్వైప్ మిషన్లు లేవు. వాటిని అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం మాత్రం సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది.