ఆప్ ఎమ్మెల్యేలు మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీపై దాడికి పాల్పడ్డారంటూ ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  అసలు విషయం ఏమిటంటే..  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇంట్లో ఆయన చూస్తుండగానే ఇద్దరు ఎమ్మెల్యేలు తనపై దాడి చేశారని దిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ ఆరోపించారు. ప్రభుత్వ ప్రణాళికల గురించి చర్చించేందుకు సోమవారం సాయంత్రం సీఎం ఇంటికి వెళ్లిన తనపై ఎమ్మెల్యేలు అజత్‌ దత్‌, ప్రకాశ్ జార్వల్‌ దాడి చేశారని అన్షు ప్రకాశ్‌ చెబుతున్నారు.

 కాగా.. చీఫ్‌ సెక్రటరీ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కాదని.. బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

ఇదిలా ఉండగా... చీఫ్ సెక్రటరీ అన్షు ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అన్షుపై ఎలాంటి దాడి గానీ.. దాడికి యత్నంగానీ జరగలేదని కేజ్రీవాల్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు అన్షు.. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఇంటికి వెళ్లారు.