ముజఫర్ నగర్: అగ్రకులం అమ్మాయిని ప్రేమించినందుకు ఓ దళిత యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ యువకుడిని సోమవారం రాత్రి అమ్మాయి తండ్రి కాల్చి చంపాడు. ఈ సంఘటన ముజఫర్ నగర్ లో జరిగింది. 

తన కూతురిని ప్రేమించినందుకు అమ్మాయి తండ్రి అనిల్ గుప్తా దళిత యువకుడు వికాస్ కుమార్ ను తన ఇంట్లోనే తుపాకితో కాల్చి చంపాడు. యువకుడి శవం బాల్కనీలో పడింది. పోలీసులు ఓ నాటు తుపాకిని కూడా అనిల్ గుప్తా ఇంటి బాల్కనీ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

తన కూతురిని దళితుడు ప్రేమించడమేమిటనే ఆగ్రహంతో అమ్మాయి తండ్రి ఉన్నాడు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరిన వికాస్ తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా కలువలేదు. దాంతో యువకుడి తండ్రి రామ్ కుమార్ న్యూ మండి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

తాను తన కొడుకు కోసం గాలిస్తుండగా గుప్తా ఇంటి వెలుపల ఓ గుంపు చేరి ఉంది. కొంచెం ముందుకు వెళ్లి చూస్తే తన కుమారుడు శవంగా కనిపించాడని రామ్ కుమార్ చెప్పాడు. 

సోమవారం రాత్రి అమ్మాయి తన వికాస్ ను ఇంటికి పిలిచిందని, అతను ఇంటికి రాగానే అమ్మాయి తండ్రి అనిల్ గుప్తా అతన్ని కాల్చి చంపాడని పోలీసులు అంటున్నారు.