Asianet News TeluguAsianet News Telugu

ఆపరేషన్లు వాయిదా

తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ ఆసుపత్రుల్లో కలిపి రోజుకు మొన్నటి వరకూ 30 వేల ఆపరేషన్లు జరిగేవి. నోట్ల రద్దు ప్రభావం వల్ల ఇపుడు రోజుకు 10 వేల ఆపరేషన్లు జరిగితే ఎక్కువ.

currency hits opertions

అసలే శీతాకాలం. ఆపై అనారోగ్యం. అంతకుమించి నోట్ల రద్దు ప్రభావం. దాంతో రోగుల పరిస్థితి వర్ణణాతీతం. ఇది ఏదో ఒక ఆసుపత్రిలో పరిస్ధితి కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది ఆసుపత్రుల్లోని వాస్తవ స్ధితి. హోటళ్లకు వెళ్ళలేక పోతున్నామనుకుంటే పర్వాలేదు డబ్బులు మిగులుతాయని సంతోషిస్తారు.

 

సినిమా చూసి చాలా రోజులైందంటే..పర్వాలేదులే ఇంట్లో టివిలో వచ్చే ఏదో సినిమాతో సరిపెట్టుకోవచ్చనుకుంటారు. వెచ్చాలకు..నెలసరి ఇస్తామంటే కిరాణాకొట్టు వాళ్లు కాదనరు.

 

పై అవసరాలు సరే, మరి అనారోగ్యం పరిస్ధితి ఏమిటి? కరెన్సీ సంక్షోభం సృష్టించిన సమస్యలు అన్నీ ఇన్నీ కావు. సాధ్యమైనంత వరకూ సామాన్య, మధ్య, ఎగువ తరగతుల కుటుంబాలు తమ అవసరాలను వాయిదా వేసుకుంటున్నాయి. అయితే, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి అవసరాలను కూడా వాయిదా వేసుకోవాల్సి రావటంతో రోగుల సమస్యలు పెరిగిపోతున్నాయి.

 

మిగితా అన్ని రంగాలను తాకినట్లే, నోట్ల రద్దు ప్రభావం ఆసుపత్రులపైన కూడా తీవ్రంగానే పడింది. దాంతో అటు ఆసుపత్రుల యాజమాన్యాలది ఒక సమస్య అయితే, రోగులది మరో సమస్య. ఇక్కడ తక్షణావసరం రోగులది కావటంతో చేతిలో డబ్బు లేదు కాబట్టి ఆసుపత్రులకు వెళ్లలేక, చెక్కులు తదితరాల ద్వారా ఆపరేషన్లు చేయటానికి యాజమాన్యాలు ఇష్టపడక పోవటంతో రోగుల పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

 

నోట్ల రద్దుతో దాదాపు ఆసుపత్రులు ఆపరేషన్లను వాయిదా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ ఆసుపత్రుల్లో కలిపి రోజుకు మొన్నటి వరకూ 30 వేల ఆపరేషన్లు జరిగేవి. నోట్ల రద్దు ప్రభావం వల్ల ఇపుడు రోజుకు 10 వేల ఆపరేషన్లు జరిగితే ఎక్కువ.

 

అవి కూడా తక్షణం ఆపరేషన్లు జరగకపోతే రోగికి ప్రాణాపాయం అనుకున్న వాటిని మాత్రమే ఆసుపత్రుల యాజమాన్యాలు చేస్తున్నాయి. మిగితా ఆపరేషన్లన్నీ నిరవధిక వాయిదాలే.

 

ఆపరేషన్లే వాయిదా పడుతుండటంతో ఇక ఔట్ పేషంట్ రోగుల సంఖ్య చెప్పేదేముంది. అవి కూడా బాగా తగ్గిపోవటంతో చాలా ఆసుపత్రుల రోజు వారి ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.

 

ఎప్పుడైతే రోజువారీ ఆదాయాలు పడిపోతున్నాయో దాని ప్రభావం సిబ్బది మీద పడుతున్నాయి. జీతాల చెల్లింపు భారమవటంతో యాజమాన్యాలు సిబ్బందిని తొలగిస్తున్నాయి. దాంతో వేలాది మంది సిబ్బంది రోడ్డున పడుతున్నారు.

 

విచిత్రమేమిటంటే చాలా ఆసుపత్రుల్లో స్వైపింగ్ మెషీన్లు లేవు. అదేమంటే, స్వైపింగ్ మెషీన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంత వరకూ అందలేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. దాంతోనే ఆపరేషన్లు కూడా వాయిదా వేయక తప్పటం లేదంటున్నాయి. చెక్కులు తీసుకుని ఆపరేషన్లు చేయాలంటే అవి బౌన్స్ అవుతున్నట్లు కొన్ని ఆసుపత్రులు చెబుతున్నాయి.

 

తెలుగు రాష్ట్రల్లోని కార్పొరేట్, సింగిల్, మల్టీ స్పాషాలిటీ, నర్సింగ్ హోంలన్నీ కలిపి సుమారు 4200 ఉన్నాయి. వాటిల్లో 30 శాతానికి మించి స్వైపింగ్ మెషీన్లు లేవు. మొన్నటి వరకూ అన్నీ ఆసుపత్రుల్లోనూ క్యాష్ అండ్ క్యారీనే.

 

ఇపుడు హటాత్తుగా వేలాది స్వైపింగ్ మెషీన్లకు డిమాండ్ పెరిగిపోవటంతో సరఫరా కష్టమవుతోంది. దాంతో పెద్ద నోట్ల రద్దు సమస్య ఎప్పుడు తీరుతుందోనని రోగులు ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేకున్నారు.

 

 

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios