Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) 160 యేళ్లుగా సికిందరాబాద్ లో దాగిఉన్న ‘1857 బ్రిటిష్ ద్రోహి’

1857 సిపాయిల తిరుగుబాటులో భారతీయులను క్రూరంగా హింసించి చంపిన ఒక బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ ఇంగ్లీషోళ్లకి జానపద నాయకుడయిపోయాడు. ఆయన పేర పాటలు రాసుకున్నారు. నవలలు రాసుకున్నారు.ఢిల్లీ హీరో అని కీర్తించుకున్నారు.  స్వాతంత్య్రం వచ్చాక ఆయన ఆనవాళ్లను ఢిల్లీ నుంచి తుడిచేశారు.అయితే,ఒకే ఒక చోట ఆయన పేరు ప్రజల కంట పడకుండా 160 సంవత్సరాలు కొనసాగింది. ఆ ఒక్క చోటేదో కాదు, సికిందరాబాద్. ఇపుడు చరిత్ర మారుతున్నది. ఆ కథేమిటో చదవండి.

cruel british army officers name is being changed video

 

 

సికిందరాబాద్ లో తిరుమలగేరిలో డైమండ్ పాయంట్  జంక్షన్ ఉంది. ఇక్కడినుంచి బ్రిగేడియర్ సయ్యద్ రోడ్ ను కలిపే చిన్న రోడ్డొకటి ఉంది.ఈ రోడ్డు నికోల్సన్ రోడ్డు. ఈ నికోల్సన్ ఎవరనేదానిమీద హైదరాబాద్ ప్రజలుగాని, కంటోన్మెంట్ అధికారులు గాని ఎపుడూ పెద్ద శ్రద్ధ చూపలేదు.  నికోల్సన్ రోడ్డు ఏమంత పెద్ద రోడ్డు కాదు. అక్కడంత ట్రాపిక్ కూడా ఉండదు. చిన్న గల్లిలాంటిది. గల్లి చిన్నదయినా, పేరు వెనక చాలా చరిత్ర ఉంది. మనం పెద్దగా పట్టించుకోలేకపోయినా,తెల్లోళ్లకు మాత్రం అతగాడొక జానపద హీరో అయ్యాడు. ఆయన మీద లెక్కలేన్ని నవలలు, పుస్తకాలు వచ్చాయి. ఆయన హీరోయిజం మీద జానపద గీతాలొచ్చాయి. రడ్యార్డ్ కిప్లింగ్ నవల ‘కిమ్’లో ఆయన ప్రస్తావన ఉంది. కిమ్ ఒక బౌద్ధబిక్షువులో కలసి యాత్రలు చేస్తున్నపుడు ఒక మిలిటరీ ఆఫీసర్ ను కలుసుకుంటాడు. దారిలో ఒక చోట బస చేసినపుడు ఆయన ఒక పాటకూడా పాడతాడు.  ఆ మిలిటరీ అధికారెవరో కాదు, నికోల్సనే. పాట ఆయన  హీరోచిత కార్యాలమీదే. ఇలా నికోల్సన్ 19వ శతాబ్దంలో తెల్లదొరలకు,వాళ్ల పిల్లలకు పెద్ద స్ఫూర్తి అయ్యాడు.

 

ఇంతకీ నికోల్సన్ ఎవరు,  వీరుడెలా అయ్యాడు?

 

నికోల్సన్ పూర్తి పేరు జాన్ నికోల్సన్(1821-1857). ఐర్లండ్ దేశస్తుడు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సైన్యంలో బ్రిగేడియర్  జనరల్ స్థాయికి ఎదిగాడు. పెళ్లిపెటాకులు చేసుకోలేదు. తెల్లో ళ్లు రాసుకునే బ్రిటిష్ ఇండియా చరిత్రలో వీరులెవరైనా ఉంటే వారిలో చిరస్థాయిగా నిలిచిపోయిన వాడు నికోల్సన్. మిలిటరీలోనే కాకుండా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో అధికారిగా కూడా పనిచేశాడు. అక్కడ కూడా ఈస్టిండియా కంపెనీకి బాగా సేవలందించాడు. 1857లో వచ్చిన సిపాయిల తిరుగుబాటు అణచేయడంలో ముందున్నాడు. చాలా క్రూరంగా తిరుగుబాటుదారులను చంపినవాడు. జలంధర్ కంటోన్నెంట్ లో ఉన్న భారతీయ వంటవాళ్లందరిని ఎలాంటి విచారణ లేకుండా చెట్టుకు వురేయించాడు. కారణం, వాళ్లంతా తనని చంపేందుకు సూప్ లో విషం కలిపారనే అనుమానం. కిచెన్ లోకి వచ్చి సూప్ ను రుచి చూడండని వంటవాళ్లని అడిగాడు. వాళ్లెవరూతాగ లేదు. వెంటనే ఒక కోతికి తాపారు. అదిచనిపోయింది. అంతే, ఆయన వారందరిని అక్కడిక్కడే వురి తీయించాడు. భారతీయ  తిరుగుబాటుదారులంటే ఆయనకు  చాలా అసహస్యం. వాళ్లని ఎలా చంపాలనేదానికి ఆయనొక పద్ధతి ఉంది. దానిని వ్యక్తీకరించాడు కూడా. ‘సజీవంగా తిరుగుబాటు దారుల చర్మం వొలిచేయాలి. సజీవంగా దహనం చేయాలి...నేనయితే, వారిని, భరించలేనంతగా హింసించి... హింసించి చంపుతాను, ప్రశాతంగా,’ అన్నాడు. అందుకే ఆయన బ్రిటిష్ వారి జానపదహీరో అయ్యాడు. ఆయన స్మారక స్థూపాలెన్నోఇంగ్లండులో ఉన్నాయి. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీలోనే గాయపడి సెప్టెంబర్ 23, 1857న ఢిల్లీ కంటోన్మెంట్ లోని ఒక బంగళాలో చనిపోయాడు.  దీనిని వీరమరణంగా బ్రిటిష్ వాళ్లు కీర్తిస్తారు. విక్టోరియన్ హీర్ ఆఫ్ ఢిల్లీ అని పేరిచ్చారు. అతని శౌర్యానికి గుర్తింపుగా బ్రిటిష్ వారు సికిందరాబాద్ లోని  ఈ చిన్న మార్గానికి 1857లో నికోల్సన్ రోడ్డు అని పేరు పెట్టారు. ఇతగాడికి ఢిల్లీలోకూడా చాలా స్మారక చిహ్నాలుండేవి. ఖడ్గం పట్టుకుని నిలబడిన విగ్రహమొకటి ఉండింది. అయితే, స్వాతంత్య్రం వచ్చాక దానిని కూల్చేశారు.

cruel british army officers name is being changed video

అయితే, సికిందరాబాద్ లో  ఉన్న ఈరోడ్డును  ఎవరూ పట్టించుకొనకపోవడంతో ఆయన పేరుతో ఉన్న రోడ్డు అలాగే ఉండిపోయింది. అయితే, ఇపుడు ఈ రోడ్డు పేరు మార్చాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. నికొల్సన్ రోడ్ పేరును బంగ్లాయుద్ధవీరుడు అరుణ్ ఖేతర్ పాల్ రోడ్డుగా మార్చాలని నిర్ణయం జరిగిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. భారత  సైన్యంలో సెకండ్ లెఫ్టినెంట్ గా ఉన్న ఖేతర్ పాల్ 1971 యుద్ధంలోచనిపోయాడు.

జూన్ 13న కంటోన్మెంట్ బోర్డు పేరు మార్పును సిఫార్సు చేస్తూ తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఢిల్లీలోని స్టేషన్ హెడ్ క్వార్టర్స్ కు పంపించారరు. తొందర్లోనే పేరు మారిపోతుంది. ఇంత క్రూరమయిన చరిత్ర ఉన్న బ్రిటిష్ అధికారి పేరు మీద ఉన్న రోడ్డను పునర్నామకరణం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వ ఉరుకుల పరుగుల మీద ఆమోదం చెబుతుందని అనుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios