సెంచూరియన్ వేధికగా శుక్రవారం భారత్- దక్షిణాఫ్రికా ఆరో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇదే రోజున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కి మధ్య టీ20 జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు చెలరేగిపోయాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏకంగా 243 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ మ్యాచ్ కారణంగా ఓ  అభిమాని సెలబ్రెటీగా మారాడు.

అసలు విషయం ఏమిటంటే.. మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఆఖర్లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. విచ్చలవిడిగా చెలరేగారు. ఈ క్రమంలో కివీస్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ బాదిన ఓ భారీ సిక్సర్‌ను ఓ అభిమాని ఒంటి చేత్తో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ లో 19.5 ఓవర్‌లో రాస్ టేలర్ భారీ సిక్సర్‌ కొట్టగా స్టాండ్స్‌ లో నిలబడి ఉన్న మిచెల్ గ్రిమ్‌స్టోన్ అనే యువకుడు ఆ బంతిని అలవోకగా సింగిల్ హ్యాండ్‌తో ఒడిసిపట్టాడు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ యువకుడిపై పడింది.

 

సింగిల్ చేత్తో ఆ యువకుడు పట్టిన క్యాచ్ ని టీవీలు కూడా పదేపదే చూపించడం విశేషం. ఒక్కసారిగా సెలబ్రెటీగా మారిపోయాడు. ఆ క్యాచ్ పట్టుకున్న తర్వాత ఆ యువకుడు, అతని మిత్రుల ఆనందం వర్ణించలేము. మరో విషయం ఏమిటంటే.. ఆ యువకుడు ఓ టీషర్ట్‌ ను ధరించి ప్రముఖ సంస్థకు ప్రచారం చేస్తున్నాడు. అతడు పట్టిన బ్రిలియంట్ క్యాచ్ సోషల్ మీడియలో వైరల్ కావడంతో సదరు సంస్థ మిచెల్‌కు 24 లక్షలు(50వేల న్యూజిలాండ్ డాలర్లు) బ‌హుమానంగా ప్రకటించింది. గ్రేట్ క్యాచ్ ప‌ట్టినందుకు బంతిని బాదిన రాస్‌టేల‌ర్ అభినంద‌న‌లు కూడా తెలిపాడు.