ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లోంచి చిన బాబు చెప్పుచేతల్లోకి వెళతున్నట్లనిపిస్తుంది.చంద్రబాబు విధేయులను తరిమేసి తన వాళ్లను తెచ్చుకోవడానికి లోకేశ్ ప్రయత్నిస్తున్నాడని, ఐవైఆర్ కృష్ణారావును సాగనంపడం ఇందులో భాగమేనంటున్నారు. చిన బాబు హిట్ లిస్టులో ఉన్న పెద్ద వాళ్లు... పరకాల ప్రభాకర్, కుటుంబరావు,లక్ష్మీ పార్థ సారధి ... జాబితా చాలా పెద్దది.

తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబునాయుడి ప్రభ కొడిగడుతోందా…? గత ఇరవైరెండేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా పార్టీని నడిపించిన ఆయన ఆధిపత్యానికి కుమారుడి రూపంలో గండి పడుతోందా…
ఇటీవల కాలంలో ఇటు ప్రభుత్వ పరంగానూ అటు పార్టీలోనూ జరుగుతున్న పలు పరిణామాలను దగ్గర నుంచి చూసిన వారు అవును టిడిపిలో తరం మారుతోందంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడు ఎరా పూర్తైనట్లే అని ఇకపై ఆయన కుమారుడు నారా లోకేష్ ప్రాభవం ప్రారంభమైందని ఆ పార్టీలో సీనియర్లు సైతం అంగీకరిస్తున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ కులంతో నిమిత్తం లేకుండా ఆయన చేసిన అపాయింట్మెంట్లన్నింటిపైనా తీవ్ర స్ధాయిలో ఒత్తిడి పెరుగుతోందని… వివిధ కార్పొరేషన్లకు, ప్రభుత్వ రంగ సంస్ధలకు, అకాడమీలకు చంద్రబాబు నియమించిన వ్యక్తులను ఒక్కొక్కరినీ సాగనంపుతూ చినబాబు నారా లోకేష్ తన భక్తులతో ఆ స్ధానాలను రీప్లేస్ చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలాగే పార్టీలో కూడా ఇరవై ఏళ్లుగా చంద్రబాబుకు నమ్మిన బంటుల్లా వ్యవహరించిన వారినందరినీ పక్కన పెట్టేయడానికి రగం సిద్దం అయినట్లు పరిస్ధితులు టిడిపి శ్రేణులు కూడా అంటున్నాయి. చంద్రబాబు నియమించిన వ్యక్తులను ఆయన చేతుల ద్వారానే తీసేసే పరిస్ధితులు చినబాబు అండ్ టీమ్ చాకచక్యంగా కల్పిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ పరంగా తీసుకుంటే ఇప్పటికే చంద్రాబాబు నియమించిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుని అత్యంత అవమానకరంగా సాగనంపింది చినబాబు టీమo అంటున్నారు. ఆయన స్ధానంలో పండగలు పబ్బాలు వస్తే నలుగురు వేదపండితులను తీసుకువెళ్లి చినబాబుకు ఆశీర్వాదాలు ఇప్పించే హైదరాబాద్ బేస్డ్ టిడిపి నాయకుడు వేమూరి ఆనందసూర్యను నియమించారు.
ఇదే తరహాలో త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు, చంద్రాబాబు ముచ్చట పడి పోస్టింగులు ఇచ్చుకున్న మాజీ ఐఎఎస్ అధికారులైన ఎపిఐఐసి చైర్మన్ పి.కృష్ణయ్య రెనివల్ రాకపోవడానికి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుడు కె.లక్ష్మీనారాయణ మరొక అసలు మంచి పోస్టింగే రాకపోవడానికి కారణం చినబాబు అంటుున్నారు.
ఎన్విరాన్మెంటల్ రీజినల్ కమిటీ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, ఎండోమెంట్ అడ్వైజర్ పివిఆర్కెప్రసాద్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పార్ధసారధి, ఎపిటిట్కో వైస్ చైర్మన్ రామ్ నాథ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సిహెచ్.కుటుంబరావు, 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ సాయిబాబు, కమ్యూనికేషన్స్ అడ్వైజర్ పరకాల ప్రభాకర్లు కూడా చినబాబు పింక్ కార్డ్ ఇచ్చే జాబితాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. తండ్రి హయంలో అందలాలు ఎక్కిన వీరందరినీ తొలగించి తనకు అత్యంత నమ్మకస్తులైన వ్యక్తులను ఆ స్ధానాల్లో నియమించడానికి నారా లోకేష్ పావులు కదుపుతున్నట్లు సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఇందులో కాపులున్నారు, కమ్మలున్నారు, బ్రాహ్మలున్నారు, వూచకోతలో చినబాబు సెక్యులర్ గా ఉంటున్నారు.

ఇక పార్టీ విషయానికి వస్తే వైశ్రాయ్ ఎపిసోడ్ జరగడానికి ముందు నుంచి ఆ తరువాత కాలంలో చంద్రబాబుకు అటాచ్ అయి అత్యంత నమ్మకంగా పార్టీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న పలువురు నాయకులకు కూడా మంగళం పాడాలని చినబాబు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు మూడేళ్ల నుంచి పార్టీని లోకేషే కంట్రోల్ చేస్తున్న విషయం ప్రతి కార్యకర్తకు తెలుసు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీపై పూర్తి పట్టు సాధించడమే కాకుండా చంద్రబాబు నామ్ ఔర్ నిషాన్ లేకుండా చెయ్యాలని లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే చంద్రబాబుకు ఎప్పటి నుంచో నమ్మకస్తులుగా ఉన్న వట్టికూటి వీర వెవకన్న చౌదరి, జయరామిరెడ్డి, తొండెపు దశరధ జనార్ధన్,ఎం.ఎ.షరీఫ్, ఎల్వీఎస్ఆర్కెప్రసాద్ వంటి నేతలను ప్రస్తుతం వారు నిర్వర్తిస్తున్న బాధ్యతల నుంచి తప్పించి తన అనూయాయులను ఆ పదవుల్లో నియమించాలని లోకేష్ భావిస్తున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

ఏది ఏమైనా ఏ రంగంలోనైనా పాత నీరు వెళ్లి కొత్త నీరు రావడం సర్వసాధారణం. అయితే రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాల్లోకి వచ్చే సరికి…కులాతీతంగా సీనియర్లను సాగనంపడం జరగుతుంది. అయితే, అంతో ఇంతో కొంత గౌరవప్రదంగా ఆ పని చేస్తే అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి కూడా శ్రేయస్కరం అంటున్నారు పరిశీలకులు.
