వెలుగులోకి వస్తున్న గుర్మీత్ దురాగతాలు డేరా బాబా ఆశ్రమంలో అస్థిపంజరాలు తనిఖీలు ప్రారంభించిన అధికారులు
ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛ సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ చేసిన దురాగతాలు.. రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. డేరా ప్రధాన ఆశ్రమమైన హరియాణాలోని సిర్సాలో గుర్మీత్ ఎన్నో రకాల చట్టవ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా.. తనకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని గుర్మీత్ చంపి.. అనంతరం వారిని ఆశ్రమంలోనే పాతిపెట్టేవాడట.
గుర్మీత్ పై వస్తున్న ఆరోపణలపై డేరా అనుకూల పత్రిక ‘ సచ్ కహూ’ ఒక విషయాన్ని తెలిపింది. ఆశ్రమంలో మృతిచెందిన వారి అంత్యక్రియలు బయట ఎక్కడో కాకుండా సిర్సా ప్రాంగణంలోనే చేయాలని గుర్మీత్ చెప్పేవారని సదరు పత్రిక తెలిపింది. నదులు కలుషితం కాకుండా ఉండేందుకు గుర్మీత్ ఇలా చెప్పేవారని పేర్కొంది. అలా అంత్యక్రియలు సిర్సా ప్రాంగణంలో చేసిన తర్వాత ఆ ప్రదేశంలో మొక్కలు నాటేవారని పత్రికలో వెల్లడించారు.
అయితే.. గుర్మీత్ భక్తులు.. ఆయన వద్దకు వచ్చి.. తమ మరణానంతరం తమను ఈ ఆశ్రమంలోనే పూడ్చిపెట్టాలని కోరేవారని.. వారివే ఆ అస్థిపంజరాలని డేరా అనుకూల ప్రతిక ప్రతినిధులు చెబుతునున్నారు. కాగా.. గుర్మీత్‌కు వ్యతిరేకంగా ఉన్నవారిని చంపేసి ప్రాంగణంలోనే పూడ్చిపెట్టేవారని డేరా నుంచి బయటకు వచ్చేసిన కొందరు చెబుతుండటం గమనార్హం.
మరోవైపు సిర్సా ప్రాంగణాన్ని శుక్రవారం ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే ఎస్ పవార్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 400 మంది బాంబు స్క్వాడ్స్, కమాండోలు, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. బయట నుంచి ఒక్కరిని కూడా లోపలికి అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. ఇందులో భాగంగానే సిర్సాలో హై అలర్ట్ ప్రకటించారు. సిర్సాలో 40 కంపెనీలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.గతంలో డేరా సచ్చా సౌదాలో హరియాణా పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
దాదాపు 700 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంగణంలో ఈఫిల్ టవర్, తాజ్‌మహర్, డిస్నీ లాండ్ నమూనాలు ఉన్నాయి. అదేవిధంగా అండర్ వాటర్ రిసార్ట్ నిర్మాణ పనులను కూడా గుర్మీత్ ప్రారంభించారు. కానీ ఆయన అరెస్టుతో దాని నిర్మాణం ఆగిపోయింది.
