రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

First Published 10, Apr 2018, 1:27 PM IST
Constable dies in road accident at anantapur
Highlights
అనంతపురం జిల్లాలో దుర్ఘటన

అనంతరంపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కానిస్టేబుల్ ను బలితీసుకుంది. ప్రయాణికులతో వేగంగా వెళుతున్న ఓ ఆటో అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ కానిస్టేబుల్ మృత్యువాతపడ్డాడు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా విడపనకల్ మండలం పాల్తూరు పోలీసు స్టేషన్‌లో రాఘవేంద్ర కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు కుటుంబంతో ఉరవకొండలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో రాఘవేంద్ర ఆదివారం రాత్రి విధులు ముగించుకుని రాత్రి అక్కడే పడుకున్నాడు. ఇవాళ ఉదయం ఉరవకొండకు ఓ షేరింగ్ ఆటోలో బయలుదేరాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ అతివేగం కారణంగా ఆటో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాఘవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తమ సహచరున్ని కోల్పోవడంతో పాల్తూరు పోలీసు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. అలాగే కానిస్టేబుల్ కుటుంబసభ్యులు కూడాఈ ప్రమాద వార్త తెలుసుకుని బోరున విలపిస్తున్నారు.

loader