హైదరాబాద్: కర్ణాటక ప్రోటెం స్పీకర్ గా కెజి బోపయ్య నియామకంతో మరో వివాదం గవర్నర్ వాజుభాయ్ వాలాను చుట్టుముట్టింది. సీనియర్ శాసనసభ్యుడిని కాదని బిజెపి నుంచి ఎన్నికైన కెజి బోపయ్య చేత ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయించడం పట్ల కాంగ్రెసు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. 

కాంగ్రెసుకు చెందిన దేశ్ పాండే 8 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. దేశ్ పాండేనే ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేస్తారని అనుకుంటూ వస్తున్నారు. అయితే, గవర్నర్ అనూహ్యంగా బోపయ్యను నియమించారు. బోపయ్య ఎంపికపై కోర్టుకు వెళ్లాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది. 

బోపయ్య గతంలో కర్ణాటక శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. స్పీకర్ గా ఆయన వ్యవహారశైలిని సుప్రీంకోర్టు తప్పు పట్టిన సందర్భం కూడా ఉంది.  ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే శాసనసభలో బలపరీక్ష జరుగుతుంది. రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు శాసనసభలో బలపరీక్ష జరగనుంది. 

కెజి బోపయ్య పూర్తి పేరు కొంబరాన గణపతి బోపయ్య. ఆయన కొడగు జిల్లాలోని కాలూరు గ్రామంలో 1955 అక్టోబర్ 17వ తేదీన జన్మించారు. బెంగళూరులోని బిఎంఎస్ కాలేజీలో న్యాయశాస్త్రం చదివారు. గోల్ట్ మెడలిస్టు కూడా. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించిన తర్వాత 1980లో మడకెరికి తిరిగి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 

ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు అత్యంత సన్నిహితుడు. కాలేజీ విద్యనభ్యసించినప్పుడు ఎబివిపిలో పనిచేశారు. 2008లో మడెకెరి నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. 

గతంలో ప్రోటెం స్పీకర్ గా పనిచేసి, ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత 2009 డిసెంబర్ 30వ తేదీన డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  జగదీశ్ షెట్టర్ రాజీనామాతో ఆయన స్పీకర్ గా ఎన్నికయ్యారు. కన్నడ నటుడు విష్ణువర్ధన్ మృతి కారణంగా స్పీకర్ ఎన్నికను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెసుకు చెందిన టీబి జయచంద్రను ఓడించి ఆయన శాసనసభ స్పీకర్ గా ఎన్నికయ్యారు.