బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయ్ వాలా బిజెపిని ఆహ్వానిస్తే సుప్రీంకోర్టు తలుపులు తట్టడానికి కాంగ్రెసు సిద్ధపడుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు జెడిఎస్ కు కాంగ్రెసు మద్దతు ఇచ్చింది. కాంగ్రెసు, జెడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది.

జెడిఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అంగీకారం కుదిరింది.  శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత బిజెపి నేత యడ్యూరప్ప జాతీయ నాయకులతో కలిసి గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. 

అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత తాను నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారు. సహజ సిద్ధంగానే తమకు మెజారిటీ లభిస్తుందని బిజెపి నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కాంగ్రెసు, జెడిఎస్ మధ్య అనైతికమైన వివాహం బంధం పట్ల చాలా మంది ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. 

తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారనే వార్తలను కాంగ్రెసు నేత సిద్ధరామయ్య ఖండించారు. శాసనసభ్యులంతా తమతోనే ఉన్నారని, ఎవరూ ఎక్కడికీ వెళ్లలేదని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.