తెలుగుదేశంలో టాప్ టు బాటమ్ భూముల వేటలో ఉన్నారు.స్మార్ట్‌సిటీ పేరు చెప్పి విశాఖపట్నంలో దాదాపు లక్షల ఎకరాల కబ్జా చేశారు. ఇందులో ఉన్నవన్నీ పెద్ద తలకాయలే అయినందున సీ బీఐ విచారణ లో మాత్రమే న్యాయం జరగుతుంది.
విశాఖ భూముల కుంభకోణం కథలో కనిపించేది మంత్రి గంటా అయితే, కథ నడిపించేది ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు ఐటి మంత్రి లోకేశ్ బాబు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపించింది.
స్మార్ట్సిటీ పేరు చెప్పి విశాఖపట్నంలో దాదాపు లక్షల ఎకరాల కబ్జా చేశారని, ఇందులో ఉన్నవన్నీ పెద్ద తలకాయలే అయినందున సీబీఐ విచారణ లో మాత్రమే న్యాయం జరగుతుందని పార్టీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు.తెలుగుదేశంలో టాప్ టు బాటమ్ భూముల వేటలో ఉన్నారని ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.
‘‘విశాఖపట్నంలో వెలుగుచూస్తున్న భూకబ్జాల పర్వం వెనుక రింగ్ లీడర్ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి అయిన లోకేష్ అని, ఆయన కనుసన్నలలో నే జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు అధికార పార్టీ ఎంఎల్ఏలు, ముఖ్య నాయకులు భూములను కొల్లగొట్టారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యంకాదు,’ అని ఆయన అన్నారు.
‘‘విశాఖ జిల్లాకు చెందిన మరో మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడే భూములు కబ్జాకు గురైనట్లు పరోక్షంగా అంగీకరించారు. అక్కడ దాకా ఎందుకు విశాఖ కలెక్టరే స్వయంగా ప్రకటించారు. రికార్డులు తారు మారు చేయడం ద్వారా లక్ష ఎకరాల మేర భూమి హాంఫట్ అయిందని ప్రకటించారు. మరో మంత్రి లోకేష్ విశాఖ వచ్చి కలెక్టర్తో మంతనాలు జరిపాక మాట మార్చి రెండు వందల ఎకరాల భూమేనని మాట మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకున్నారు. భూ కుంభకోణంలో మొత్తంగా అధికార పార్టీ పెద్దలు, మంత్రులు, ఎంఎల్ఏలు, కొంతమంది అధికారుల ప్రమేయం ఉంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ చెప్పు చేతలలో ఉండే తూతూ మంత్రం విచారణ వల్ల నిజా నిజాలు నిగ్గు తేలే అవకాశాలే లేవు. సీబీఐతో విచారణ జరిపించాల్సిందే,’’ అని ఆయన అన్నారు.
విశాఖ భూ కుంభకోణంపై చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశించడం భూ కుంభకోణాన్ని నీరుగార్చడానికేనని ఎవరైనా టక్కున చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతిని అంతం చేస్తామని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సీబీఐ విచారణ దేశించాలని,గతంలో అవుటర్ రింగ్ రోడ్ విషయంలో ఆరోపణలు వచ్చినపుడు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించిన విషయం గుర్తుంచుకోవాలని శివాజి అన్నారు.
