పేదరికం కారణంగా ఎక్కడ చదువుకు దూరమైపోతానో అన్న బాధతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన జడ్చర్ల లో చోటుచేసుకుంది. పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులులేక మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల మండలంలోని కోడ్గల్ గ్రామానికి చెందిన శేఖర్, సత్యమ్మ దంపతుల కూతురు అలివేలు(19). వీరి కుటుంబం కడు పేదరికంలో ఉన్నప్పటికి అలివేలు బాగా చదువుతుండటంతో పైచదువులు చదివిస్తున్నారు. ప్రస్తుతం ఈమె జడ్చర్లలోని బీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే ఆర్థిక కారణాలతో వార్షిక పరీక్ష ఫీజు కట్టలేకపోయింది. దీంతో తన చదువు ఇక్కడితో ఆగిపోతుందని మనస్తాపానికి లోనైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లించి ఉంటే తమ కూతురు ఈ అఘాయిత్యానికి పాల్పడేది కాదని తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేసారు. అయితే అలివేలు ఆత్మహత్యకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జడ్చర్ల సీఐ బాలరాజుయాదవ్‌ తెలిపారు.