అతడో జిల్లాకు బాస్. చిన్నారులంటే అతడికి ఎంత ప్రాణమో ఇటీవల ఆయన ప్రవేశపెట్టిన బాల స్వస్త కార్యక్రమమే చెబుతుంది. అలా ఈ పథకం ద్వారా ఇప్పటికే చిన్నారుల పట్ల తన ప్రేమను చాటి జిల్లా వాసుల ప్రశంసలు పొందారు. ఆయన మరో సారి చిన్నారులపై తన ప్రేమను చాటి వారికి చదువు విలువను తెలియజెప్పారు. స్వయంగా తానే రంగంలోకి దిగి బడికి వెళ్లకుండా మేకలు కాస్తున్న ఇద్దరు చిన్నారులను స్కూళ్లో చేర్చించి తన పనితనంతో పాటు తన ప్రేమను ప్రదర్శించారు. ఆయనే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్.

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా రొనాల్డ్ రాస్ చిన్నారుల ఆరోగ్యం కోసం బాల స్వస్థ అనే కార్యక్రమాన్ని ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో బాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి కలెక్టర్ దేవరకద్ర నియోజకవర్గానికి వెళ్లారు.ఈ పర్యటనలో బాగంగా కారులో ప్రయాణిస్తున్న ఆయన చౌదరి పల్లి  స్టేజి వద్ద ఇద్దరు చిన్నారులు మేకలు కాస్తుండటాన్ని గమనించారు. వెంటనే తన కారును నిలిపి ఆ చిన్నారులతో మాట్లాడాడు. తమ పేర్లు మౌలానా, ఖాజాలుగా తెలిపిన చిన్నారులు, తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ కోసమే ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. తమకూ చదుకోవాలని వున్నా కుటుంబ పరిస్థితులు అనుకూలించకే ఈ పని చేస్తున్నట్లు కలెక్టర్ కు  తెలిపారు. దీంతో కలెక్టర్ ఈ చిన్నారులను తన కారులో ఎక్కించుకుని దేవర కద్ర ఉర్ధూ మీడియం పాఠశాలలో చేర్పించారు.  వీరిద్దరికి చదువు ప్రాధాన్యత గురించి కౌన్సెలింగ్ ఇచ్చి బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని రొనాల్డ్ రాస్ సూచించారు.