ఈ ఐదు రోజులు తెలంగాణ వణికిపోతుంది

First Published 29, Dec 2017, 7:50 PM IST
Cold intensity increased in Telangana
Highlights
  • తెలంగాణ లో ఈ ఐదురోజుల్లో పెరగనున్న చలితీవ్రత
  • హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఇప్పటికే  పల్లు కొరికే చలితో తెలంగాణ ప్రజలు గజగజా వణికి పోతుంటే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తీవ్ర శీతల గాలులు వీయనున్నట్లు దీంతో చలి తీవ్రత అధికమయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 

 ఇవాళ ఉదయం చలి తీవ్రత మరీ ఎక్కువగా నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని మూడు జిల్లాల్లో అయితే 10 సంవత్సరాల రికార్డును బద్దలుగొడుతూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో వరుసగా 3.7 డిగ్రీల, 8.6 డిగ్రీల , 9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ  జిల్లాల్లో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు 3.9 డిగ్రీల, 12.5 డిగ్రీల, 10.6 డిగ్రీల సెల్సియస్ లుగా ఉండగా ఈ రికార్డు ఇవాళ బద్దలయ్యింది.

ఈ చలిగాలులపై ఐ ఎమ్ డి డైరెక్టర్ వైకే రెడ్డి  మాట్లాడుతూ...తెలంగాణకు ఉత్తర మరియు ఉత్తర-ఈశాన్య దిశ నుండి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా మార్పులు ఏర్పడినట్లు తెలిపారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత ఒకేరోజు పడిపోతే ఈ  కోల్డ్ వేవ్ హెచ్చరికలు జారీచేస్తామని తెలిపారు ఉత్తర తెలంగాణాలో 24 గంటలు హెచ్చరిక ఉంటుందన్నారు. 

ఇక హైదరాబాద్ లోను ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.  రానున్న రెండు మూడు రోజుల్లో మరో డిగ్రీ ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన GHMC విపత్తు సెల్ అధికారులు  రాత్రి సమయాల్లో వీధుల్లో నిద్రించే నిరాశ్రయులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవాళ ఉదయం వివిధ జిల్లాల ఉష్ణోగ్రతలు  ఇలా నమోదయ్యాయి.

ఆదిలాబాద్ - 3.7 డిగ్రీల సెల్సియస్

భద్రాచలం - 8.6 డిగ్రీల సెల్సియస్

మెదక్- 8.8 డిగ్రీల సెల్సియస్

ఖమ్మం - 9 డిగ్రీల సెల్సియస్

రామగుండం - 10 డిగ్రీల సెల్సియస్

హైదరాబాద్- 11.3 డిగ్రీల సెల్సియస్

హన్మకొండ - 11.5 డిగ్రీల సెల్సియస్

నిజామాబాద్ - 11.7 డిగ్రీల సెల్సియస్

నల్గొండ - 14 డిగ్రీల సెల్సియస్

హకింపెట్ - 14.6 డిగ్రీల సెల్సియస్

మహబూబ్ నగర్ - 15.1 డిగ్రీల సెల్సియస్
 

loader