రోజుకి ఎన్ని సార్లు కాఫీ తాగుతున్నారు..? ఎన్ని గంటలు ల్యాప్ టాప్ తో కుస్తీలు పడుతున్నారు..? ఎన్ని సిగరెట్లు పీల్చిపడేస్తున్నారు..? ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతన్నారు అని  అనుకుంటున్నారా..? వాటి సమాధానమే.. అబ్బాయిల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎక్కువ సార్లు కాఫీ తాగడం, ల్యాప్ టాప్, సిగరెట్లు, కూల్ డ్రింక్స్ తాగడం ఇవన్నీ.. అబ్బాయిల వీర్యకణాల సంఖ్యను తగ్గించేస్తున్నాయట. తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

అంతేకాదు.. మన దేశంలో 27.5మిలియన్ల మంది దంపతులు పిల్లలు పుట్టడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారిలో 30 నుంచి 40శాతం మంది పురుషుల వీర్యకణాల సంఖ్య తగ్గిపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది,. వీరిలో ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం కప్పులకు కప్పులు కాఫీలు లాంగించేయడం, గంటల కొద్దీ ల్యప్ టాప్ ముందు కూర్చోవడం, మద్యం, సిగరెట్లు విపరీతంగా తాగడమేనని వైద్యులు గుర్తించారు.

ఇప్పటివరకు అమ్మాయిల్లో వయసు పెరుగుతున్న కొద్దీ,.. పిల్లల పుట్టే సామర్థ్యం తగ్గిపోతుందన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఈ సమస్య పురుషుల్లో కూడా తలెత్తుతుందంటున్నారు వైద్యులు. అబ్బాయిల వయసు 30 దాటిన నాటి నుంచి వారి వీర్య కణాల సంఖ్య తగ్గడం మొదలౌతుందట. దీనికి తోడు పైన చెప్పిన వాటికి కూడా ఎడిక్ట్ అయితే.. ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతోంది అంటున్నారు వైద్యులు.