ఆనాడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగునేల జాతీయోద్యమంలో, స్వాతంత్య్ర  పోరాటంలో కీలకపాత్ర పోషించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఎందరో వీరుల త్యాగాలు, ఆత్మబలిదానంతో, దేశం స్వాతంత్ర్యం సాధించుకుందన్నారు. రాష్ట్ర ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారికి ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో పాలెగాళ్లు క్రీశ 1800లో తిరుగుబాటు చేశారని, 1943లో కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిని ప్రతిఘటించి అమరుడయ్యాడని గుర్తుచేశారు. దేశచరిత్రలోనే అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో సాగిన మన్యం అడవిబిడ్డల పోరాటం చిరస్మరణీయమైనదన్నారు. సైమన్ కమిషన్ రాక సందర్భంలో తూటాలకు భయపడక, టంగుటూరి ప్రకాశం పంతులు గారు  చూపిన ధైర్యసాహసాలు కలకాలం స్ఫూర్తిదాయకమన్నారు. 


  ఆకాశంలో సగర్వంగా రెపరెపలాడుతున్న జాతీయపతాకాన్ని రూపొందించింది తమ రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య అని చెప్పడానికి తామెంతో గర్విస్తున్నామన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ చిత్తూరు జిల్లా మదనపల్లి బీటీ కళాశాలలో ‘జనగణమన’ గీతాన్ని 1919లో  బెంగాలీ భాష నుంచి ఆంగ్లంలోకి అనువదించారని, ఆ కళాశాల ప్రిన్సిపాల్ భార్య మార్గరెట్ క్యూజిన్స్ స్వర కల్పన చేశారని తెలిపారు. అటువంటి చరిత్ర ఉన్న చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీవారి ఆశీస్సులతో ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. 


  తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి దుస్తులు  లేకపోతే స్వాతంత్య్రానికి అర్ధం లేదన్నారు. సంక్షేమ రాజ్య సిద్ధాంతానికి, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర పురోభివృద్ధికి తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు.