చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి

First Published 13, Apr 2018, 4:32 PM IST
chittor road accident
Highlights

కారును ఢీకొన్న ఆర్టీసి బస్సు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దపంజాణి మండలం బట్టందొడ్డి సమీపంలో ఓ కారు, ఆర్టీసి బస్సు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీ కొట్టుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు కు చెందిన రిటైర్డు డీఈ దొరస్వామి, అతని పక్కింట్లో ఉండే అనిత, ఆమె కొడుకు నవీన్‌, మనవడు హర్షిత్‌ లు కలిసి స్థలం రిజిస్ట్రేషన్‌ పనిపై కారులో చిత్తూరుకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. మదనపల్లె నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. రెండు వాహనాలు మితిమీరిన వేగంతో ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఇందులో ప్రయాణిస్తున్న దొరస్వామి, నవీన్‌(26), హర్షిత్‌(6) అక్కడిక్కక్కడే మృతి చెందారు.  తీవ్ర గాయాలపాలైన అనిత మదనపల్లె ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

loader