అక్టోబర్ 18-20 ల మధ్య రాష్ట్రానికి తుఫాను ముప్పు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను ముందస్తు హెచ్చరిక చేశారు. 

ఈ నెల 18 - 20 తేదీల మధ్య రాష్ట్రానికి తుఫాను వస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 

ఈరోజు నీరు-ప్రగతి, వ్యవసాయంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ హెచ్చరిక చేశారు.

గతంలో ఏపీలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ముందు చూపుతో తీసుకున్న నష్టనివారణ చర్యల వల్ల తక్కువ నష్టంతో బయటపడ్డామని, అందుకే ఇపుడు ముందస్తు హెచ్చరిక చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిడుగు పాట్లగురించి గంట ముందే ప్రమాదం ఉన్న గ్రామాలకు సమాచారం చేరవేస్తున్నది. ఇపుడు తుఫాను గురించి కూడా చాలా ముందుగానే సమాచారం ఇవ్వడం మొదలుపెట్టింది.

మరోవైపు, ముంపు ముప్పు ఉన్నప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకి చేర్చే పనిలో నిమగ్నం కావాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో కొంచెం ఆలస్యంగానైనా సమృద్ధిగా వర్షాలు పడ్డాయమని ఫలితంగా భూగర్భ జలమట్టం కూడా 5.5 మీటర్లు పెరిగిందని ఆయన చెప్పారు.

జలకళతో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెబుతూ చెక్ డ్యాముల నిర్మాణం, పంట కుంటల తవ్వకాలను వేగవంతం చేయాలని అధికారులని ఆయన ఆదేశించారు.