త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘విలేజ్ మాల్’ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం 29 వేల చౌకధరల దుకాణాలను ‘విలేజ్ మాల్’లుగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ‘అన్న విలేజ్ మాల్’ పేరుతో తొలివిడతగా 6,500 దుకాణాల ఏర్పాటు చేస్తారు. తక్కువ ధరకు, నాణ్యమైన నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ఖాళీగా వున్న 4,599 చౌకధరల దుకాణాలకుకూడా  డీలర్లను వెంటనే నియమించాలని ఆయన శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తివేసినా తెల్ల రేషన్‌కార్డుదారులకు మార్కెట్ ధర కన్నా 50% తక్కువకు అర కిలో పంచదార పంపిణి చేయాలని  కూడా ఆయన సూచనలిచ్చారు. వచ్చే ఏడాది జనవరి నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అర కిలో పంచదారను సబ్సిడీపై ఇస్తారని చెబుతూ ప్రత్యేక అవసరాల కోసం కొన్ని సామాజికవర్గాల వారికి వైట్ కిరోసిన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.