హడావిడిగా ఏపీలో కార్పొరేషన్ల భర్తీలు చేసేందుకు కసరత్తలు మొదలుపెట్టారు ఏపీలో త్వరలో కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే.. చంద్రబాబుకి ఇక్కడ కూడా తెలంగాణ విషయంలో ఒక సమస్య ఎదురైంది

చంద్రబాబుకి తెలంగాణ సెగ బాగా తగిలినట్టు కనిపిస్తోంది. అందుకే హడావిడిగా ఏపీలో కార్పొరేషన్ల భర్తీలు చేసేందుకు కసరత్తలు మొదలుపెట్టారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి తాజాగా.. కాంగ్రెస్ పార్టీలో చేరగా , ఆయన వెంట మరికొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలింది. దాదాపు.. టీటీడీపీ అంతా ఖాళీ అయిపోయింది. ఇదే ఘటన ఏపీలో పునరావృతం కాకుండా ఉండేందుకు చంద్రబాబు చర్యలు మొదలుపెట్టారు.

ఏపీలో త్వరలో కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ లు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలుగుదేశం నాయకత్వం ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారమిక్కడ కొందరు పార్టీ నేతలతో సమావేశమై రాష్ట్ర కార్యాలయం తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించారు. సాధారణంగా చంద్రబాబు కార్పొరేషన్ల ఏర్పాటుకు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ.. మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని వాటి ఏర్పాటుకు చర్యలు మొదలు పెట్టారు.

గిరిజనులకు సంబంధించిన నామినేటెడ్‌ పదవులను ముందుగా భర్తీ చేయాలని యోచిస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పాలక మండలి, ట్రైకార్‌ వంటి సంస్థలకు కార్యవర్గం ఏర్పాటుతోపాటు పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ఇంకా భర్తీ చేయాల్సి ఉన్న కార్పొరేషన్లు, దేవాలయ పాలక మండళ్లపైనా చర్చిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నియామకం కూడా ఇందులో ఒకటి.

టీటీడీ ట్రస్టు బోర్డు కూడా నియమిస్తారా..?

 కార్పొరేషన్ల భర్తీ అనగానే.. టీటీడీ ట్రస్టు బోర్డు నియాకంపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. ట్రస్టు బోర్డుని కూడా నియమిస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. అయితే.. చంద్రబాబుకి ఇక్కడ కూడా తెలంగాణ విషయంలో ఒక సమస్య ఎదురైంది

గతంలో టీటీడీ పాలక మండలి నియామకంలో తెలంగాణ ప్రాంతం వారికి కూడా ప్రాతినిథ్యం కల్పించారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో పరిమాణాలను బట్టి కొంత కాలం వెయిట్ చేయాల్సిందేనని భావిస్తున్నారు. టీటీడీపీ దాదాపు ఖాళీ కావడంతో.. టీటీడీ పాలకమండలిలో ఎవరిని నియమించాలనే ప్రశ్న చంద్రబాబులో మొదలైంది. అందుకే ఈ నియామకాన్ని కొంత కాలం పక్కన పెట్టాలనుకుంటున్నారట. ఏదేమైనా రేవంత్ దెబ్బ.. చంద్రబాబుకి గట్టిగానే తగిలిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.