తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు సీటుకి ఎసరు తెస్తుందా? తనను తాను కాపాడుకోవడం కోసం యనమలను పక్కకు తప్పించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారా?

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు సీటుకి ఎసరు తెస్తుందా? రేవంత్ కారణంగానే యనమలను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారా? అవుననే వాదనలు వినపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి.. ఏపీ నేతలు యనమల, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆ ఆరోపణల ప్రభావం యనమలను చుట్టుముడుతున్నట్లు కనపడుతోంది.

వచ్చే నెలలో జగన్ పాదయాత్ర మొదలౌతుంది. అంతేకాకుండా ఎన్నికలు కూడా మరెంతో దూరంలోలేవు. దీంతో యనమల పై రేవంత్ చేసిన ఆరోపణలను జగన్ ఎక్కడ ఎన్నికల అస్త్రాలుగా మలుచుకుంటాడో అనే భయం.. చంద్రబాబులో మొదలైంది. దీంతో తనను తాను కాపాడుకోవడం కోసం యనమలను పక్కకు తప్పించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారనే వాదనలు వినపడుతున్నాయి.

మరికొద్ది రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం కూడా కనపడుతోంది. ఈ మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబు ఈ మార్పులు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే.. యనమల నొచ్చుకోకుండా, బీసీ సామాజిక వర్గాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు అనే రాంగ్ మెసేజీ ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఆయనను రాజ్యసభ్యకు పంపించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. యనమల కూడా ఎప్పటి నుంచో తనని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేసి రాజ్యసభకి పంపమని అడుగుతున్నారు. దీంతో ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్న చందంగా ఈనిర్ణయం చంద్రబాబు తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.

అంతేకాకుండా ఆనం రామ నారాయణ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక.. ఆయనకు ఆర్థిక మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు.తాజాగా ఈ ప్రచారం మళ్లీ ఊపందుకుంది. దీంతో ఈ సారి మాత్రం ఆనం కి ఆర్థిక మంత్రి పదవిని కట్టబెట్టడం ఖాయమని తెలుస్తోంది.