బెంగళూరు: శాసనసభలో జరిగే బలపరీక్షలో నెగ్గుతామని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం కచ్చితంగా విశ్వాస పరీక్షలో నెగ్గుతుందని సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందిస్తూ ఆయన అన్నారు.

బలపరీక్షకు తాము సిద్ధమేనని, తన ప్రభుత్వాన్ని బలపరిచేందుకు తగిన సంఖ్యాబలం ఉందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని అన్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పుపై గవర్నర్ వాజుభాయ్ వాలా న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. 

ప్రస్తుతం కర్ణాటక శాసనసభలో 222 మంది సభ్యులున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే యడ్యూరప్పకు 112 మంది సభ్యుల బలం అవసరం. బిజెపి 104 సీట్లను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెసు 78, జెడిఎస్ 38 సీట్లు గెలుచుకున్నాయి. ఈ రెండు కూటమి కట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాయి. 

కాంగ్రెసు, జెడిఎస్ కూటమి బలం 116 ఉంది. సాధారణ మెజారిటీ కన్నా అధికమే. అయితే  తమకు 116 మంది సభ్యుల మద్దతు ఉందని బిజెపి వాదిస్తోంది. కాంగ్రెసుకు చెందిన ఎనిమిది మంది, జెడిఎస్ కు చెందిన ఇద్దరు తమకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతోంది. 

అంటే పది మంది సభ్యుల ఫిరాయింపు ద్వారా యడ్యూరప్ప నెగ్గాలని అనుకుంటున్నారు. మరో రకంగా కూడా ఆయన నెగ్గే అవకాశం ఉంది. శాసనసభకు కాంగ్రెసు, జెడిఎస్ కు చెందిన 14 మంది సభ్యులు గైర్హాజరైనా యడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుంది. దానివల్ల ఆరు నెలల పాటు ప్రభుత్వంలో ఏ సమస్య లేకుండా మైనారిటీ ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చు. ఈలోగా తగిన బలాన్ని సమీకరించుకోవచ్చు. 

మొత్తం మీద, యడ్యూరప్ప భవిష్యత్తు శనివారం సాయంత్రం 4 గంటలకు తేలనుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రోటెం స్పీకర్ ఆధ్వర్వంలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకం జరపవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ప్రోటెం స్పీకర్ ఎంపిక శుక్రవారం నాలుగు గంటల లోపల జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ శాసనసభ్యులను కాంగ్రెసు, జెడిఎస్ హైదరాబాదుకు తరలించాయి. రేపు సాయంత్రం 4 గంటల లోగా వారు మళ్లీ బెంగళూరు చేరుకోవాల్సి ఉంటుంది.  శుక్రవారం రాత్రే ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలిస్తామని కాంగ్రెసు తెలంగాణ నేత షబ్బీర్ అలీ చెప్పారు.