కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే తగిలింది. చంద్రబాబు ఆశించినవేవి బడ్జెట్లో ప్రతిఫలించలేదు. విభజన హామీలకు సంబంధించి గానీ, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి గానీ బడ్జెట్లో ఆశించిన కేటాయింపులు కనబడలేదు. ఈ ఏడాది చివరలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి  ఈ బడ్జెట్టే చివరి బడ్జెట్ అన్న విషయం స్పష్టంగా అర్థమౌతోంది.  

ఎటూ టిడిపి ఎన్డీఏలో మిత్రపక్షం కాబట్టి తన డిమాండ్ మేరకు బడ్జెట్ కేటాయింపులుంటాయని చంద్రబాబు ఆశించారు. అందుకనే ఏడాదిన్నర తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడికి 17 పేజీల చిట్టాను అందచేశారు. ప్రధాని కూడా సానుకూలంగానే స్పందించారని పచ్చమీడియాతో ఊదరగొట్టించుకున్నారు. తీరా చూస్తే ఏపికి మొండిచెయ్యే చూపించింది కేంద్రం.

విభజన చట్టం ప్రకారం రెవిన్యూ లోటు భర్తీ కావాలి. రాజధాని నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. పోలవరం ప్రాజెక్టు నిధులివ్వాలి. అవసరమైన అనుమతులు మంజూరు చేయాలి. విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. దాంతో పాటు అనేక రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి. జాతీయస్ధాయి విద్యాసంస్ధలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్ధల కేటాయింపు ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం నుండి రావాల్సినవి చాలానే ఉన్నాయి. కానీ మూడున్నరేళ్ళలో పెద్దగా రాలేదు.

ఎటుతిరిగి వచ్చేది ఎన్నికలే కాబట్టి చివరి సంవత్సరంలో అయినా కేటాయింపులు జరిపి, డిమాండ్లు తీర్చి ఎన్నికల్లో ఓట్లడుగుతారని అందరూ భావించారు. కానీ చివరకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర పథకాల విషయంలో బడ్జెట్లో కాస్త సానుకూలం కనిపించింది.

అయితే అవేవీ టిడిపికి  సంబంధం లేనివే. వాటి వల్ల లాభపడితే భారతీయ జనతా పార్టీ లాభపడాలే కానీ టిడిపికేమీ సంబంధం లేవన్న విషయం గమనించాలి. చంద్రబాబు కూడా ఈ బడ్జెట్ గురించే ఇంతకాలం ఓపికపట్టారు. అయితే, చంద్రబాబు ఆశించినట్లు బడ్జెట్ కేటాయింపులు లేదు కాబట్టి దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పడుతుంది. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.