దశాబ్దాల పాటు ముస్లిం మహిళలను ఆర్ధికంగ, సామాజికంగా పట్టి పీడిస్తున్న‘త్రిబుల్ తలాక్’ పద్దతికే తలాక్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. త్రిబుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటివి ముస్లిం మహిళల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది.

కోట్లాది ముస్లిం మహిళలకు కేంద్రప్రభుత్వం అండగా నిలిచింది. దశాబ్దాల పాటు ముస్లిం మహిళలను ఆర్ధికంగ, సామాజికంగా పట్టి పీడిస్తున్న‘త్రిబుల్ తలాక్’ పద్దతికే తలాక్ ఇవ్వాలని తేల్చి చెప్పింది. త్రిబుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటివి ముస్లిం మహిళల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొంది. పై విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలోని పలు ముస్లిం మహిళా సంఘాలు కూడా సుప్రింకోర్టులో సవాలు చేసాయి. పై విధానాల వల్ల రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను ముస్లిం మహిళలు పూర్తిస్ధాయిలో అనుభవించలేక పోతున్నట్లు కేంద్రం అభిప్రాయపడింది.

రాజ్యాంగం ప్రకారం స్త్రీ, పురుషులు ఇద్దరు సమానమేనని కూడా కేంద్రం స్పష్టం చేసింది. కానీ పురుషులతో పోల్చుకుంటే ముస్లిం మహిళలు మాత్రం తమ వ్యక్తిగత హక్కులను కోల్పోతోన్నట్లు చెప్పింది కేంద్రం. అందుకనే త్రిబుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కేంద్రం సుప్రింకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇవన్నీ పాతకాలపు భావాలుగా కేంద్రం కొట్టేసింది. అసలు ముస్లిం పర్సనల్ లా బోర్డు గడచిన 60 ఏళ్ళుగా మహిళలకు మద్దతుగా ఎలాంటి సంస్కరణలను చేపట్టలేదన్న విషయాన్ని కూడా కేంద్రం సుప్రింకోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి చెల్లుబాటు కాకూడదని అభిప్రాయపడింది కేంద్రం.

ముస్లిం మహిళలు పురుషుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడటాన్ని రాజ్యంగంలోని 14,15 అధికరణలు ఏమాత్రం ఆమోదించవని కేంద్రం స్పష్టం చేసింది. బహుభార్యత్వం, త్రిబుల్ తలాక్ వంటి సంప్రదాయాల అమలులో మతంకన్నా సామాజిక పరిస్ధితుల ప్రభావాన్నే ఎక్కువగా చూడాలన్నది. ఇదిలా వుండగా ఏడాదిన్నరలోగా త్రిపుల్ తలాక్ విధానానికి ముగింపు పలకనున్నట్లు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షుడు కల్బే సాధిక్ ప్రకటించటం గమనార్హం.