వెంకయ్య చెప్పినట్లు నిజంగానే కేంద్రం పై చట్టాలని తెస్తే ప్రజారోగ్యం బాగుపడటంతో పాటు రోడ్లపైన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా వరకూ తగ్గుతాయి.

నోట్ల రద్దు తదితర రాజకీయాలు ఎలాగున్నా కేంద్ర ప్రభుత్వం రెండు మంచి చట్టాలు తేబోతోంది. రెండు కూడా సమాజానికి మంచి చేసేవే కావటం గమానార్హం. ఒకటిః ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పనిసరి చేయటం. రెండోదిః కార్ పార్కింగ్ లేనివారికి వాహనాలు అమ్మకూడదని నిర్ణయించటం. ఈ రెండూ కూడా దీర్ఘకాలంలో దేశానికి మంచి చేసేవే.

ఇళ్ళలో మరుగుదొడ్లు లేని కారణంగా దేశంలోని కోట్లాది మంది అనారోగ్యాల భారిన పడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా గ్రామీణ ప్రజలు ఇంకా తమ అవసరాలకు బహిరంగ ప్రదేశాలనే ఉపయోగించుకోవటం నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే.

స్వచ్ఛభారత్ పై టివిల్లో వచ్చే ప్రకటనల్లో ప్రముఖ నటుడు అమితాబచన్ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ఆవస్యకతను రోజూ చెబుతున్న విషయాన్ని చూస్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయడు మాట్లాడుతూ, వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోకపోతే ఇళ్ళ నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదనే చట్టాన్ని తేనున్నట్లు చెప్పారు.

అదేవిధంగా, ఇళ్ళలో సరైన పార్కింగ్ స్ధలం చూపకపోతే కార్లకు రిజిస్ట్రేషన్ చేయరని వెంకయ్యనాయడు స్పష్టం చేసారు. ఈ మేరకు త్వరలో చట్టం చేస్తున్నట్లు కూడా చెప్పారు. రిజిస్టర్ చేయని కార్లలో యజమానులు ఎక్కువ కాలం బయట తిరగలేరు.

ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేకపోతే పోలీసులు జరిమానా విధిస్తారు. సరైన పార్కింగ్ స్ధాలం లేకపోయినా చాలా మంది కార్లు కొనేస్తున్నారు.

హైదరాబాద్ విషయమే చూస్తే తక్కువలో తక్కువ 15 లక్షల కార్లుంటాయి. ఈ కార్లకు పార్కింగ్ స్ధలాలున్న ఇళ్ళు తక్కువే. ఎక్కువ భాగం రోడ్లపైనే పార్కింగ్ చేసేస్తుంటారు. అదేమంటే, రోడ్లపై వాహనాలను పార్క్ చేయటం తమ జన్మహక్కుగా యజమానులు మాట్లాడుతుంటారు. ఒక్కో ఇంట్లో మూడు, నాలుగు కార్లు వుండటంతోనే పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి.

ఒక్క కారును ఇంట్లో ఉంచి మిగిలిన కార్లన్నింటినీ రోడ్లపైనే పెడుతుండటంతో రోడ్లు కూడా ఇరుకైపోతున్నాయి. సామాజికస్పృహ లేని కారణంగానే సమస్యలొస్తున్నాయి.

అయితే, వాహనాలు కొన్నా పార్కింగ్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయమని కాదు కేంద్రం చెప్పాల్సింది. పార్కింగ్ స్ధలం చూపకపోతే అసలు కారే అమ్మమనే చట్టం చేయాలి. ఇటువంటి చట్టం మలేషియా, సింగపూర్ లాంటి పలు దేశాల్లో ఎప్పటి నుండో అమలులో ఉంది.

ఆ దేశాల్లో కొనుగోలుదారు పార్కింగ్ స్ధలం చూపితేనే వాహన డీలర్ కారు అమ్ముతాడు. అప్పుడే రిజిస్రేషన్ కూడా జరుగుతుంది. వెంకయ్య చెప్పినట్లు నిజంగానే కేంద్రం పై చట్టాలని తెస్తే ప్రజారోగ్యం బాగుపడటంతో పాటు రోడ్లపైన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా వరకూ తగ్గుతాయి.