చంద్రబాబు ఆశలపై నీళ్లు..!

First Published 26, Oct 2017, 1:00 PM IST
center shocks chandrababu over polavaram project
Highlights
  • పోలవరం ప్రాజెక్టును ఎన్నికల స్టంట్ గా వాడుకొని.. 2019 ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలన్న చంద్రబాబు ఆశలకు కేంద్రం గండి కొట్టింది.
  • దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయాడు చంద్రబాబు.

చంద్రబాబు ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. పోలవరం ప్రాజెక్టును ఎన్నికల స్టంట్ గా వాడుకొని.. 2019 ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలన్న చంద్రబాబు ఆశలకు కేంద్రం గండి కొట్టింది. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయాడు చంద్రబాబు.

2019కల్లా పోలవరం పనులు పూర్తి చేస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతూనే ఉన్నాడు. అయితే.. గడిచిన మూడున్నర ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు పనులు పెద్దగా జరిగిందేమీ లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన ట్రాన్ స్ట్రాయ్ సంస్థ ఏమీ చేయకపోయినా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆయనలో చలనం మొదలైంది. పోలవరం పనులు పూర్తవ్వాలంటే కాంట్రాక్టర్ ని మార్చాలి అంటూ.. కేంద్రాన్ని కోరాడు. ఈ విషయంలో కేంద్రం కూడా చాలా తెలివిగా ప్రవర్తించి.. చంద్రబాబుకి షాక్ ఇచ్చింది.

ఇప్పుడు కాంట్రాక్టర్ని మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. కాంట్రాక్టర్ ని మారిస్తే అంచనా వ్యయం పెరిగిపోతుందని..అది తాము భరించలేమని చెప్పేసింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పనిచేసే సామర్థ్యంలేని ట్రాన్ స్ట్రాయ్ సంస్థకు అప్పగించడంపై రివర్స్ లో చంద్రబాబుకే అక్షింతలు వేసినట్లయ్యింది. దీంతో  చంద్రబాబుకి దిమ్మతిరిగిపోయింది.

కేంద్ర ప్రభుత్వ షాక్ తో.. తాజాగా బీజేపీ, టీడీపీ పొత్తుల వ్యవహారం కూడా కీలకంగా మారింది. పొత్తు కొనసాగితే.. రెండు పార్టీలు ఈ విషయంలో దెబ్బతినాల్సి  ఉంటుంది. పొత్తు కొనసాగకపోతే.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకొని.. మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మొదలుపెడతాయి.

ఇదిలా ఉంటే.. పోలవరం పనులు చంద్రబాబు తన జీవితకాలంలో పూర్తి చేయలేరని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. అసలు రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2022 లోపు పూర్తికాదని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

loader