భీమ్ (భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మొబైల్) యాప్ మీకు గుర్తుండే ఉంటుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో భాగంగా గత ఏడాది ఏప్రిల్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధికారిక అప్లికేషన్ ఇది.మొదట్లో ఈ అప్లికేషన్ చాలా మంది వినియోగదారులు వాడినప్పటికీ  తేజ్, ఫోన్ పే, పేటీఎం వంటి అప్లికేషన్లు భారీ మొత్తంలో  క్యాష్ బ్యాక్ లను అందించడం మొదలు పెట్టాక చాలామంది ఈ భీమ్ యాప్ ని వాడడం మానేశారు.  దీంతో.. భీమ్ యాప్ కూడా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఈ యాప్ విడుదల చేసి  సంవత్సరం కావస్తోంది. ఈ సందర్భంగా కష్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇది రేపు అంటే శనివారం నుంచి అమలులోకి వస్తుంది.
 
ఈ యాప్ ని ప్రోత్సహించడానికి 900 కోట్ల రూపాయలకు cashbackల రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. భీమ్ యాప్ వాడకం పెంచడం ద్వారా డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించి నగదు అవసరాన్ని వీలైనంత తగ్గించాలన్నది ప్రభుత్వ ఆలోచన. వాస్తవానికి గత ఏడాది ఆగస్టు నెలలో మొత్తం యూపీఐ లావాదేవీల్లో 40.5శాతం లావాదేవీలు కేవలం భీమ్ యాప్  ద్వారానే జరిగాయి. కానీ ఆ తర్వాత మాత్రం దీని వాడకం పూర్తిగా తగ్గిపోయింది. 

అందుకే ఈ యాప్ కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తానని ప్రకటించింది. ఈ యాప్  ద్వారా మొదటిసారి లావాదేవీ చేసేవారికి 51 రూపాయల క్యాష్‌బ్యాక్, ఆ తర్వాత చేయబడే 20 లావాదేవీల వరకూ ఒక్కోదానికి గరిష్టంగా 25 రూపాయలు, 25 నుండి 50 లావాదేవీలకు అన్నింటికీ కలిపి 100 రూపాయలు, 50 నుండి 100 లావాదేవీలు చేసినవారికి అన్నింటికీ కలిపి 200 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తామని ప్రకటించింది.