హైదరాబాద్ లో చికిత్స చేయించుకోరాదంటున్న ప్రభుత్వం రోగులు ఇబ్బందులు పడతారన్న కార్డియాలజీ విభాగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం హార్ట్ పేషెంట్స్ కి హార్ట్ ఎటాక్ తెప్పించేలా ఉంది. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ రోగులు గుండె జబ్బు చికిత్సలను హైదరాబాద్ లో చేయించుకోరాదని ఏపీ నిర్ణయం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీని వల్లన చాలా మంది గుండె సంబంధిత జబ్బులతో బాధపడే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్థిక స్థోమత కలిగిన వారు ఎక్కడైనా వైద్యం చేయించుకోగలరని.. స్థోమత లేని వాళ్లే ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు పేర్కొన్నారు. ఏపీలో సామాజికంగా.. ఆర్థికంగా వెనుకబడిన వారే అధికంగా ఉన్నారని వారు అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న వారు ప్రభుత్వ నిర్ణయం కారణంగా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం అధ్యక్షుడు డా.కస్తూరి శ్రీధర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డా.శరత్ చంద్ర, ట్రెజరర్ డా. విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
