చేవెళ్ళ మండలం మీర్జాగూడ దగ్గర ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి  చెట్టుకు ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్, డేవిడ్, అర్జున్‌, శ్రావణ్ అనే యువకులు ఫేస్ బుక్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇవాళ సెలవురోజు కావడంతో వీరంతా కలిసి విహారం కోసం ఆల్టో కారులో హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు  బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు మీర్జాగూడ సమీపంలోని గేటు దగ్గరకు రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న మర్రిచెట్టును వేగంగా ఢీకొంది. దీంతో కారులో ఉన్న ప్రవీణ్, డేవిడ్, అర్జున్‌ అక్కడికక్కడే మృతిచెందగా శ్రావణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.