నగదు రహిత లావాదేవీల ప్రయత్నం మంచిదే. అయితే, అందుకు తగ్గట్లుగా ముందు మౌళిక సదుపాయాల కల్పన జరగాలి.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారు. నోట్ల రద్దు వల్ల తతెత్తిన కరెన్సీ సంక్షోభాన్ని అధిగమించేందుకు మార్గాలను వెతకాల్సిన సిఎంలిద్దరూ రాష్ట్రాలను నగదు రహిత లావాదేవీలుగా మార్చాలని కంకణం కట్టుకోవటం ఆశ్చర్యంగా ఉంది.

అసలు తమ ప్రయత్నాలు ఎంత వరకూ సాకారమవుతుందన్న కనీసపు ఆలోచన కూడా లేకుండా ప్రకటనలు చేస్తున్నారు.

మన రాష్ట్రంలోని ప్రజలకు కార్డు ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఉన్న అవగాహన ఎంత ? ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులున్న వారి సంఖ్య ఎంత, ఆన్ లైన్ ద్వారా లావాదీలు జరుపుతున్న వారి శాతమెంత అన్న కనీసపు ఆలోచన కూడా వీళ్లకు ఉన్నట్లు కనబడటం లేదు. ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టే’యమన్నట్లుగా ఉంది వీరిద్దరి వ్యవహారం.

ప్రధానమంత్రి పెద్ద నోట్లను రద్దు చేసినంత తొందరగా నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకటం అంత సులభం కాదు. మన రాష్ట్రాల్లో ఉన్న అక్షరాస్యుల శాతమేమిటి, రాష్ట్రాల్లోని ఎన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంది? ఎన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది లాంటి లెక్కలు వీరి వద్ద ఉన్నట్లు కనబడటం లేదు.

నగరాల్లోనే ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు అనేక మంది ఉన్నారు. పెద్ద పెద్ద నగరాల్లోనే మొబైల్ సిగ్నల్ అందని ప్రాంతాలు అనేకమున్నాయి.

ఇటువంటి పరిస్ధితుల్లో నగదు రహిత లావాదేవీలన్నది కేవలం ఆకాశానికి నిచ్చెనేయటమే. నగదు రహిత లావాదేవీల ప్రయత్నం మంచిదే. అయితే, అందుకు తగ్గట్లుగా ముందు మౌళిక సదుపాయాల కల్పన జరగాలి. మెడికల్ షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, కిరాణా కొట్లు లాంటి అనేక చోట్ల ఇప్పటికీ కేవలం నగదును మాత్రమే అనుమతిస్తుండటం గమనార్హం.

అంతెందుకు చెక్కు రూపంలో అద్దెలు తీసుకోవటానికి యజమానులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఎందుకంటే, ఆ చెక్కును బ్యాంకులో వేస్తే గాని నగదుగా మారదు. బ్యాంకుల్లో చెక్కు వేయాలంటే గంటల కొద్దీ క్యూలో నిలబడాలి. ఒకవేళ వేసినా అవసరమున్నంత డబ్బు ఖాతాదారులకు అందటం లేదు. ఇక, చెక్కులు తీసుకుని ఏమిటి ఉపయోగమని యజమానులు ప్రశ్నిస్తున్నారు.

నగదు రహిత లావాదేవీలు అన్న మాట వినటానికి ఎంత బాగుంటుందో అమలులో అంత కష్టం. కాబట్టి సిఎంలిద్దరూ తక్షణం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అవసరాల మేరకు డబ్బును తెప్పించి బ్యాంకుల ద్వారా ప్రజలకు అందే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రజల్లో ఓపికి నశించి అనేక అనర్ధాలకు దారితీసే ప్రమాదముంది.