ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇక నుంచి ఆదివారం ఉచిత ఫోన్ కాల్స్ చేసుకోలేరు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలే నైట్‌ కాల్స్ ని తగ్గించగా.. తాజాగా ఉచిత కాల్స్‌ ను రద్దు చేయడం గమనార్హం.

‘ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆదివారం ఉచిత కాలింగ్‌ సదుపాయాన్ని నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా పాత, కొత్త వినియోగదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ కోల్‌కతా టెలిఫోన్స్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

2016 ఆగస్టులో ఉచిత నైట్‌ కాలింగ్‌, ఆదివారం ఉచిత కాలింగ్‌ సదుపాయాలను బీఎస్‌ఎన్‌ఎల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ల్యాండ్‌లైన్‌, కాంబో, బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు ఆదివారం ఏ నెట్‌వర్క్‌ కైనా ఉచితంగా ఫోన్లు చేసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ సదుపాయాన్ని నిలిపివేస్తోంది.  మిగతా రోజుల మాదిరిగానే.. ఆదివారం కూడా ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపింది.