యడ్యూరప్ప కుమారుడికి బిజెపి మొండిచేయి

BS Yeddyurappa's Son Vijayendra Won't Contest From Varuna
Highlights

యడ్యూరప్ప కుమారుడికి బిజెపి మొండిచేయి

బెంగళూరు: బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి బిఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. దీంతో వరుణ శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మధ్య జరగాల్సిన ప్రచ్ఛన యుద్ధానికి తెర పడింది.

వరుణ నుంచి బిజెపి అభ్యర్థిగా విజయేంద్ర పోటీ చేస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థిగా సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర పోటీ చేస్తున్నారు. దాంతో వరుణలో విజయేంద్రకు, యతీంద్రకు మధ్య పోటీ జరుగుతుందని భావించారు. 

వరుణ ప్రస్తావన లేకుండా బిజెపి నాయకత్వం సోమవారం మరో ఏడుగురితో అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. వరుణ నుంచి తన కుమారుడు పోటీ చేయడం లేదని యడ్యూరప్ప ఎన్డీటివీతో చెప్పారు. 

తనకేమీ అసంతృప్తిగా లేదని, వరుణ నుంచి తన కుమారుడిని పోటీకి దింపకూడదని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం అనుమతితోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఈ నియోజకవర్గంలో విజయేంద్ర విశేషంగా శ్రమించారని, ఇప్పుడు ఆయన ఆ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని యడ్యూరప్ప చెప్పారు. విజయేంద్రకు టికెట్ ఇవ్వకపోవడంతో వరుణలోని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.  
 

loader