ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తాంత్రిక పూజలు కలకలం రేపాయి. గత కొద్ది రోజుల క్రితం విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజలు ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ పూజల కారణంగా ఏకంగా ఈవోనే బదిలీ అయ్యారు. ఈ వివాదం ఇంకా సమసిపోకముందే.. మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తాజాగా కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో తాంత్రిక పూజలు జరిపారు.  అధికారులే స్వయంగా ఈ పూజలు జరిపించినట్లు సమాచారం. బుధవారం రోజున ఉదయం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా  ఈ పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు.

గుప్తనిధుల కోసమే..  అధికారులు ఈ పూజలు చేశారని సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇదే చెన్నంపల్లి కోటలో గుప్తనిధులు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఆ నిధుల కోసం రోజులపాటు తవ్వకాలు జరిపారు. అయినప్పటికీ.. ఎలాంటి నిధులు బయటపడలేదు. కేవలం  గుర్రం ఎముకలు, ఇటుకలు మాత్రమే లభ్యమయ్యాయి. దీంతో.. తాంత్రిక పూజలు జరిపితే.. నిధి బయటపడే అవకాశం ఉందని ఇలా చేశారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కానీ, ఉన్నతాధికారులు కానీ ఎవరూ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.