యడ్డీ షార్ట్ సిఎం కారు, ఐదేళ్ల సిఎం: విజయంపై అమిత్ షా ధీమా

BJP will win 130 seats, form government in Karnataka
Highlights

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. యడ్యూరప్ప షార్ట్ సిఎం కాదని, ఐదేళ్ల పాటు సిఎంగా ఉంటారని, తాను ఇది అతి విశ్వాసంతో చెప్పడం లేదని, ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానని ఆయన అన్నారు. 

కర్ణాటకలో ప్రచారం బాగా చేశామని, ప్రజలకు దగ్గరగా వెళ్లామని అన్నారు. ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి సిద్ధూ వైఫల్యాలను ఎత్తి చూపామని అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం నేరాలను అభివృద్ధి చేసిందని అన్నారు. కర్ణాటక అభివృద్ధి అంతా బెంగళూర్ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిందని వ్యాఖ్యానించారు. 

తాము 130 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరొకరి మద్దతు తీసుకునే లేదా మరొకరికి మద్దతు ఇచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యేల కుమారులు దాడులు చేస్తారు, కేసుల నుంచి తప్పించుకుంటారని అన్నారు.

కర్ణాటక ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 15వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. కర్ణాటక శాసనసభ స్థానాలు మొత్తం 224 కాగా, 223 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జయనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు మరణించడంతో ఆ స్థానానికి ఎన్నిక రద్దయింది.

loader