సౌత్ ఇండియన్స్ పై బీజేపీ ఎంపీ జాతివివక్ష ఆరోపణలు
దేశంలో భిన్నమతాలు, విభిన్న సంస్కృతులు ఉన్నా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా భారతీయులమే అని సగర్వంగా చెప్పుకుంటుంటాం. అయితే అఖండ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకొనే బీజేపీలోని ఓ నేతే ఇప్పుడు ఉత్తరాది వేరు, దక్షణాది వేరు అనేలా మాట్లాడారు. అంతకంటే కాస్త ఎక్కువే అన్నారు. దక్షణ భారత్ లో అంతా నల్లటివాళ్లే ఉంటారు. అయినా వాళ్లను మీము చిన్నచూపు చూడమని ఉత్తరాదివారి దయార్థ హృదయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
ఇటీవల దేశంలో ఆఫ్రికా విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి ద స్ట్రీమ్ అనే ఆఫ్రికన్ చానెల్‌తో బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ మాట్లాడుతూ... ఆఫ్రికన్ల లాగే మా దేశంలోని దక్షణాది ప్రజలు కూడా నల్లగానే ఉంటారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రజలు నల్లగా ఉన్నా వాళ్లను మేము ఆదరిస్తున్నాము అంటూ తన నోటి పైత్యాన్ని వెల్లగక్కారు
ఆయన వ్యాఖ్యలపై అప్పుడే దక్షణాది నేతలు భగ్గుమంటున్నారు. దక్షిణ భారతీయుల పట్ల అనుచితంగా మాట్లాడిన ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నేత, సినీనటి ఖుష్బు, డీఎంకే నేత కణిమెళి ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనవి తెలవిలేని మాటలని విమర్శించారు.
అయితే తన తప్పున గ్రహించిన తరుణ్ తర్వాత ట్విటర్ లో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. మేము కృష్ణున్ని పూజిస్తాం అంటే నలుపును గౌరవిస్తున్నట్లే కదా.. జాతి వివక్షకు తాము పాల్పడలేదని చెప్పడమే తన ఉద్దేశ శం తప్పితే ఎవరిని కించపరచాలని కాదు అని తెలిపారు.
