నియోజకవర్గంలోని ప్రజల మన్నన పొందకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవమన్న భయముంటేనే అభివృద్ధిని పట్టించుకుంటారు.
పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్లు రీ కాలింగ్ సిస్టమ్ మనకు చాలా అవసరమే. ఎంఎల్ఏ, ఎంపిల పనితీరు పట్ల ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు సంతృప్తిగా లేకపోతే వారిని వెనక్కు పిలిపించటమే రీకాలింగ్ సిస్టమ్. ఈ విధానాన్ని అమలు చేయాలంటూ భారతీయ జనతా పార్టీ ఎంపి వరుణ్ గాంధి ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఒక ప్రతినిధిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉన్నపుడు వారిని తొలగించే హక్కు కూడా అదే ప్రజలకు ఉండాలన్నది వరుణ్ వాదన. నిజమే కదా? అలాగే, ప్రజాప్రతినిధులు అవకతవకలకు పాల్పడినపుడు, తమ విధి నిర్వహణలో విఫలమయ్యారని ప్రజలు అనుకున్నపుడు, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినపుడు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి రీ కాలింగ్ సిస్టమ్ అమలు చేయాల్సిందేనంటూ వరుణ్ వాదిస్తున్నారు.
నిజంగా వరుణ్ గాంధి ప్రవేశపెట్టబోతున్న బిల్లు గనుక సభా ఆమోదం పొందితే దేశంలో ఇక ఎన్నికలే ఎన్నికలు. ఇపుడున్న నేతల్లో చాలా మంది అర్ధాంతరంగా తమ పదవులను కోల్పోయినా ఆశ్చర్యం లేదు. నిజానికి మనకు రీ కాలింగ్ సిస్టమ్ అవసరం చాలా వుంది. ఒకసారి ఎన్నికైతే మళ్ళీ ఐదేళ్ళకు గానీ నియోజకవర్గ మొహం చూడని నేతాశ్రీలు చాలా మందే ఉన్నారు. నియోజకవర్గంలో గెలవగానే అదేదో తమ సొంత ఆస్తిలాగ పరిగణించే నేతలే చాలా మంది. అదృష్టం కొద్ది టిక్కెట్టు దక్కించుకున్న తర్వాత పోటీ చేసేందుకు అప్పులు చేసిన వారు తర్వాత ఐదేళ్ళలోనే కోట్లాది రూపాయలు వెనకేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
ఇటువంటి వారి విషయంలో రీ కాలింగ్ సిస్టమ్ అన్నది చాలా మంది పద్దతి. నియోజకవర్గంలోని ప్రజల మన్నన పొందకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవమన్న భయముంటేనే అభివృద్ధిని పట్టించుకుంటారు. రీ కాలింగ్ సిస్టమ్ పై దేశంలో ఎప్పటి నుండో చర్చ జరుగుతోంది. ఎన్నికల కమీషన్ కూడా ఈ విధానంపై చర్చించాల్సిందిగా గతంలోనే అన్నీ పార్టీలను కోరింది. వరుణ్ ప్రవేశపట్టబోతున్న బిల్లుకు పార్టీ రహితంగా యువ ఎంపిలు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.
