బిజెపిపై రాహుల్ గాంధీ ఫైర్: బెంగళూరులో కాంగ్రెస్ నిరసనలు

First Published 17, May 2018, 10:36 AM IST
BJP celebrates hollow win, India mourns defeat of democracy: Rahul
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు బిజెపిపై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు బిజెపిపై కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రవ్యాఖ్యలు చేశారు. సంఖ్యాబలం లేకున్నా బిజెపి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకుందని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన వ్యాఖ్యలను పోస్టు చేశారు. 

కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని, బిజెపి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని అన్నారు. బిజెపి ఓ వైపు సంబరాలు చేసుకుంటూ ఉంటుంటే దేశం ప్రజాస్వామ్యం ఖూనీ అయినందుకు విచారం వ్యక్తం చేస్తోందని అన్నారు. 

ఇదిలావుంటే, కర్ణాటక రాజధాని బెంగళూరులో కాంగ్రెసు నాయకులు నిరసనకు దిగారు. శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వారు నిరసనకు దిగారు. కాంగ్రెసు జాతీయ  నాయకులు అశోక్ గెహ్లాట్, గులాం నబీ ఆజాద్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో పాటు పలువురు నాయకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

జెడిఎస్ నాయకులు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవహారం కోర్టులో ఉందని, తాము ప్రజల్లోకి వెళ్లి బిజెపి రాజ్యాంగ ఉల్లంఘించిన తీరును ఎండగడుతామని అన్నారు.

loader