శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ధి సాధిస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతోంది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు    ఇంకా చాలా మంది ప్రజలు మూఢనమ్మకాల ముసుగు నుంచి ఇంకా బయటకు రావడం లేదు. ఇందుకు నిదర్శనమే.. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన.

ఆలయాల వద్ద చాలా మంది నిప్పుల గుండాలు తొక్కుతూ ఉంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం.  ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ముక్కు పచ్చలారని చిన్నారిని అరిటాకులో చుట్టి.. నిప్పుల మధ్య పడుకోపెట్టారు. ఈ వింత సంఘటన హుబ్లీ దగ్గరలోని కండ్ గోల్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

మొహరంలో భాగంగా దర్గా వద్ద ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో ఓ వ్యక్తి తన 18నెలల కుమారుడిని ఈ విధంగా నిప్పుల మధ్య పడుకోబెట్టాడు. దానిని వీడియో తీయగా.. ప్రస్తుతం అది కాస్త వైరల్ గా మారింది. తమకు మగ పిల్లాడు పుట్టాలని కొన్ని సంవత్సరాలుగా వేడుకున్నామని.. ఆ దేవుని దయ కారణంగా తమకు మగ బిడ్డ జన్మించాడని.. అందుకే మొక్కు తీర్చుకున్నామని చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బిల్లు తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న క్రమంలో ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే.. బాలునికి ఎలాంటి హాని జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం చేయకుండా.. బాలుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కోరింది. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.