కొన్ని సంవత్సరాలుగా మూఢనమ్మకాల పేరుతో ప్రజలు తమను తాము మోసం చేసుకుంటూ గడుపుతున్నారు. కాలం మారినా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వీటిని ఆచరిస్తూ ప్రాణాలు బలిగొంటున్నారు. భర్త మరణిస్తే.. భార్య కూడా తనువు చాలించాలని, చేత బడులన్నీ.. ఇంకా అమలుపరుస్తూనే ఉన్నారు. వీటికి కర్ణాటక ప్రభుత్వం స్వస్తి పలకాలనుకుంటోంది.

రానున్న శీతాకాల సమావేశాల్లో మూఢనమ్మకాల వ్యతిరేక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి.. దానిని ఆమోదింప చేయాలని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. దీనితోపాటు.. 700 సంవత్సరాలుగా ప్రజలు పాటిస్తున్న ‘మేడ్ స్నాన’ విధానాన్ని కూడా రద్దు చేయాలనుకుంటున్నారు. అంటే.. గుడిలోని కొలనులో స్నానం చేసి.. గుడి చుట్టు పొర్లి దండాలు పెడుతుంటారు భక్తులు. దానిని కూడా రద్దు చేయాలనుకుంటోంది కర్ణాటక ప్రభుత్వం.

 

దక్షిణ కర్ణాటకలోని కొన్ని ఆలయాల్లో.. బ్రాహ్మణులు తీసుకోగా మిగిలిన ఆహారాన్ని  ఆలయంలోని నీటికొలనులో కలుపుతారు. ఆ ఆహారం కలిపిన నీటిలో కనుక వెనుకబడిన కులాల వాళ్లు స్నానం చేస్తే.. వారికి పుణ్యం దక్కుతుందని, అంతేకాకుండా ఏవైనా చర్మ వ్యాధులు ఉన్నా తగ్గిపోతాయనే ఆచారం ఉంది. ఈ నియామాన్ని అక్కడి  సుబ్రహ్మణ్య స్వామి ఆయాల్లో ప్రతి సంవత్సరం పాటిస్తూ వస్తున్నారు.అయితే.. ఈ నియమాన్ని రద్దు చేయాలని చాలా కాలంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. కనుక దీనిని కూడా ఆ బిల్లులో చేర్చే యోచనలో ఉన్నారు.

కేవలం ప్రజలకు హాని కలిగించే వాటిని మాత్రమే ఈ బిల్లులో చేరుస్తున్నామని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. వాస్తు, ఆస్ట్రాలజీ లాంటి నమ్మకాలను , ప్రజలను ఎలాంటి హాని కలిగించని వాటిని బిల్లులో చేర్చమని ఆయన చెప్పారు.