పెద్ద నోట్ల రద్దు తరువాత ఎదురౌతున్న సమస్యలతో ఓ వైపు దేశమంతటా గగ్గోలు పెడుతుంటే పురంధేశ్వరికి అసలు వ్యతిరేకతే కనబడటం లేదుట.

వినండహో..వినండి..వినండి..కాషాయ నేత పెద్దమ్మ చెబుతున్న మాట. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఎక్కడ కూడా వ్యతిరేకత కనబడటం లేదట. అలాగని భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి చెబుతున్నారు. అసలు ఆమె దేశంలో ఉన్నారో లేదో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఎదురౌతున్న సమస్యలతో ఓ వైపు దేశమంతటా గగ్గోలు పెడుతుంటే పురంధేశ్వరికి అసలు వ్యతిరేకతే కనబడటం లేదుట.

నోట్ల రద్దు ప్రకటనను ప్రధానమంత్రి ప్రకటించిన రోజు నుండి సోషల్ మీడియాలో అంటే ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ తదితరాలలో మోడి అనుకూల-వ్యతిరేక వర్గాలకు పెద్ద యుద్ధమే నడుస్తొంది. పాపం భాజపా నేత చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోవటం వల్ల ఆ విషయం తెలియటం లేదేమో. అయితే, శుక్రవారం ఇదే విషయమై సుప్రింకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతైనా పెద్దమ్మకు తెలుసో తెలీదో.

కేంద్రప్రభుత్వ చర్యల వల్ల దేశంలో అల్లర్లు జరిగే ప్రమాదముందని సుప్రింకోర్టు ఆందోళన వ్యక్తం చేయటం కూడా తెలీదనే అనుకోవాలా ? ఇవన్నీ అలాగుంటే, ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త గోవిందాచార్య అయితే నోట్లరద్దుపై కేంద్రప్రభుత్వానికి ఏకంగా లీగల్ నోటీసు ఇవ్వటం కూడా తెలీదనే అనుకోవాలేమో.

 దేశంలోని నల్లధనాన్ని వెలికి తీయటాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఆ పేరుతో కోట్లాది మందిని రోజుల తరబడి ఇబ్బందులు పెట్టడంపైనే ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. పది రోజులుగా దేశ ప్రజలందరూ ఇంకే పనీ లేనట్లుగా తెల్లవారింది మొదలు చిల్లరో రామచంద్రా అంటూ బ్యాంకుల ముందు బారులు తీరి నిలబడటం కూడా పెద్దమ్మకు తెలీదంటే సదరు నేత మానసిక స్ధితిని సందేహించాల్సిందే.

ఇకపోతే, మొత్తం నల్లధాన్ని తీసుకువస్తే దేశంలోని ప్రజలందరి ఖాతాల్లో వేయవచ్చని చెప్పింది ప్రతిపక్షాలు కాదు. ఎన్నికల ముందు ఆ విషయం చెప్పింది సాక్షాత్తు కాషాయ నేతలే. అంతేకాదు, బడా పారిశ్రామిక వేత్తల్లో కొందరి రుణాలను గడచిన రెండేళ్ళలో రద్దు చేసిన విషయం కూడా పురంధేశ్వరికి తెలియదంటే నమ్మాల్సిందే.