Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ టెల్ కి భారీ పెనాల్టీ?

  • ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ కు ఆధార్ అధికృత సంస్థ యూఐడీఏఐ గట్టి షాక్ ఇచ్చింది.
Bharti Airtel likely to face penalty for misusing Aadhaar details

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ కి భారీ పెనాల్టీ పడే అవకాశం ఉందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే..ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ కు ఆధార్ అధికృత సంస్థ యూఐడీఏఐ గట్టి షాక్ ఇచ్చింది. ఆధార్ టు మొబైల్ సిమ్ వెరిఫికేషన్ లో భాగంగా ఆధార్ ను మొబైల్ నంబర్ కు లింక్ చేసేటప్పుడు కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండా - వారితో సంబంధం లేకుండా ఎయిర్ టెల్ సంస్థ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను కస్టమర్ కోసం ఓపెన్ చేస్తోందని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. కాగా ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన యూఐడీఏఐ ఎయిర్ టెల్ - ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ కు సంబంధించిన ఈ-కేవైసీ లైసెన్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ లలో తెరిచిన ఖాతాలను ఎల్ పీజీ సబ్సిడీ కోసం వినియోగిస్తున్నారనే సమాచారం తెలియడంతో యూఐడీఏఐ ఈ చర్యను తప్పుబట్టింది. పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను తెరిచే విషయంలో గతంలోనే యూఐడీఏఐ ఎయిర్ టెల్ కు రెండు సార్లు నోటీసులను పంపింది. కానీ వారు ఇచ్చిన సమాధానంతో యూఐడీఏఐ తృప్తి చెందలేదు. దీంతో తాజాగా ఆ సంస్థ ఎయిర్ టెల్ పై ఈమేరకు చర్యలు తీసుకుంది.ఎయిర్ టెల్ - ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన ఈ-కేవైసీ లైసెన్స్ ను యూఐడీఏఐ తాత్కాలికంగా నిలిపివేసింది.

కాగా ఈ-కేవైసీ లైసెన్స్ తాత్కాలిక నిలిపివేతపై ఎయిర్ టెల్ కు కూడా ఉత్తర్వులు అందినట్లు ఆ సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు. అయితే ఈ విషయంపై యూఐడీఏఐ అధికారులను సంప్రదిస్తున్నామని త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎయిర్ టెల్ ప్రతినిధి ఒకరు చెప్పారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. యూఐడీఏఐ ఉత్తర్వులతో ఎయిర్ టెల్ లో కస్టమర్ల ఆధార్ - మొబైల్ లింకింగ్ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios